- ఆ తేదీ తమకు ఓకే అని కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ
- ఇంకా తేల్చని తెలంగాణ ప్రభుత్వం
- 20 నుంచి అసెంబ్లీ నేపథ్యంలో 19వ తేదీపై తర్జనభర్జన
- హరీశ్‌రావు ఢిల్లీ నుంచి వచ్చాక సీఎంతో చర్చించి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి వీలుగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండే అపెక్స్ కౌన్సిల్ తొలి భేటీ 19న ఢిల్లీలో జరిగే అవకాశం ఉంది. వివాదాల పరిష్కారంకోసం అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో సన్నాహాలు ఆరంభించిన కేంద్ర జల వనరుల శాఖ భేటీకి సంబంధించిన తేదీలపై అభిప్రాయాలు కోరగా, ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 19వ తేదీని సూచించారు.
ఈ మేరకు మంగళవారం ఆయన కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌కు లేఖ రాశారు. అయితే ఈ తేదీపై తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న దృష్ట్యా, చంద్రబాబు సూచించిన తేదీకి తెలంగాణ సమ్మతిస్తుందా? లేక మరో తేదీని సూచిస్తుందా? అన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు తిరిగొచ్చాక, సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం చేస్తారని నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.
గొడవంతా కొత్త ప్రాజెక్టులపైనే..: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై రెం డు రాష్ట్రాల మధ్య రెండేళ్లుగా అనేక వివాదాలు తలెత్తాయి. తెలంగాణ రీ డిజైన్ చేస్తు న్న ప్రాణహిత, కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులతో పాటు వాటర్ గ్రిడ్‌పైనా అనేక అనుమానాలు లేవనెత్తుతూ ఏపీ ప్రభుత్వం కేంద్రం, నదీ బోర్డులకు ఫిర్యాదు చేసింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలోనే అనుమతులిచ్చారని, రీ డిజైన్ ప్రాజెక్టులన్నింటికీ గతంలోనే అన్ని అనుమతులున్నాయని తెలంగాణ అంటోంది. కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయిం పు లే లేనప్పుడు, ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవడం ఎందుకని ప్రశ్నిస్తోంది. నిర్ణీత కేటాయింపుల్లోంచే తమ వాటా నీటిని వాడుకుంటున్నామని చెబుతోంది. ఏపీ మా త్రం పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తోందని తెలంగాణ వాదిస్తోంది.
90టీఎంసీల అదనపు వాటాకోసం కొట్లాట: ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టును చేపట్టినందున బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తమకు 45 టీఎంసీలు, ఇదే అవార్డు ప్రకారం ఇంకా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే పైరాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతూ మొత్తంగా 90 టీఎంసీలు తమకు దక్కుతాయని తెలంగాణ అంటోంది. వివాదాలపై బోర్డుల వద్ద చర్చ జరిగినా శాశ్వతంగా ఎలాంటి పరిష్కారం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని ఏపీ పదేపదే కోరుతున్నా, తెలంగాణ మాత్రం తిరస్కరిస్తోంది. అయితే తాజాగా పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులపై ఏపీకి చెందిన కొందరు రైతులు సుప్రీంను ఆశ్రయించడం, అపెక్స్ కౌన్సిల్ భేటీలో దీన్ని పరిష్కరించుకోవాలని కోర్టు సూచించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ భేటీకి కేంద్రం సిద్ధమైంది. మంగళవారం ఈ అంశంపై తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోషి, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీతో భేటీ అయ్యారు. తేదీల ఖరారు, తెలంగాణ అభ్యంతరాలపై చర్చించారు.