130 బార్ల కోసం వెల్లువెత్తిన దరఖాస్తులు
చివరి రోజు 1,500 వరకు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: కొత్త బార్ల కోసం వ్యాపారులు బారులు తీరారు. బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునేందుకు గురువారం చివరి రోజు కావడంతో హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో జాతర వాతావరణం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల నుంచి వ్యాపారులు క్యూ కట్టారు. ఎక్సైజ్ అధికారులు రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి రాత్రి వరకు దరఖాస్తులను స్వీకరిస్తూనే ఉన్నారు. గురువారం ఒక్కరోజే 1,200 నుంచి 1,500 వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. వీటితో కలిపి మొత్తం 2,500 వరకు దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 700కు పైగా బార్లకు తోడు కొత్తగా మరో 130 బార్లకు లెసైన్సులు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ భావించింది.
ఈ మేరకు గతవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 130 బార్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 60 ఉండగా, మిగిలినవి కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీలు, కార్పొరేషన్ల పరిధిలో ఏర్పాటుకానున్నాయి. కాగా, నగర పంచాయతీల్లో కొత్తగా బార్లు ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చినట్లు దరఖాస్తులను బట్టి తెలుస్తోంది. దరఖాస్తు రుసుము రూ. 5 వేలు కావడంతో ఒక్కో నగర పంచాయతీ నుంచి పదుల సంఖ్యలో వచ్చాయి.
డ్రా పద్ధతిలోనే కేటాయింపు
భారీగా దరఖాస్తులు రావడంతో మద్యం దుకాణాల తరహాలోనే బార్లను కూడా డ్రా పద్ధతిలోనే కేటాయించనున్నారు. గురువారం వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని ముందుగా తిరస్కరిస్తారు. అనంతరం గ్రేటర్ పరిధిలో 13 వేల జనాభా, నగర పంచాయతీల్లో 30 వేల జనాభా ప్రాతిపదికన బార్లను డ్రా పద్ధతిలో కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెలరోజులు పడుతుందని ఎక్సైజ్ అధికారి ఒకరు తెలిపారు.