పోస్టులు వందల్లో.. దరఖాస్తులు లక్షల్లో
విద్యుత్ ఇంజనీర్ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులు పోటెత్తాయి. పోస్టులు ఉన్నది వందల సంఖ్యలోనైతే.. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యలో లక్షను దాటిపోయింది. 856 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం జెన్‌కో గత నెలలో దరఖాస్తులు ఆహ్వానించగా... ఏకంగా 1,09,308 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క ఎలక్ట్రానిక్స్ విభాగంలో చూస్తే ఉన్న పోస్టులు 70 కాగా.. ఏకంగా 37,078 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా దరఖాస్తు గడు వు బుధవారంతో ముగిసిపోగా, ఒక్కో పోస్టు కు 127 మంది పోటీ పడుతున్నారు. వచ్చే నెల 14న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
ఎన్పీడీసీఎల్‌లో 35 వేల దరఖాస్తులు
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)లోనూ ఏఈ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. 164 ఏఈ పోస్టులకు 35,623 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరీల వారీగా చూస్తే 159 ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు 33,010 మంది, 3 ఏఈ (సివిల్) పోస్టులకు 1,316 మంది, 2 ఏఈ (సీఎస్/ఐటీ) పోస్టులకు 1,297 మంది పోటీ పడుతున్నారు. వచ్చే నెల 8న రాత పరీక్ష జరగనుంది.
ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్‌లోనూ...
ట్రాన్స్‌కో 206 ఏఈ (184 ఎలక్ట్రికల్, 22 సివిల్) పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా ఇప్పటి వరకు 47 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చే నెల 4వరకు గడువున్న నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. వచ్చే నెల 29న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఇక దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) 201 ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ప్రకటన చేయగా.. ఇప్పటివరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటికి దరఖాస్తు గడువు గురువారంతో ముగిసిపోనుండగా, వచ్చే నెల 22న రాత పరీక్ష జరుగుతుంది.