TSJENCO
-
ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి ఆపండి.. తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి తక్షణమే విద్యుదుత్పత్తి నిలిపివేయాలని తెలంగాణను కృష్ణా బోర్డు ఆదేశించింది. తెలంగాణ విద్యుదుత్పత్తితో తమ రాష్ట్ర తాగు, సాగు ప్రయోజ నాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పందించిన బోర్డు గురువారం తెలంగాణకు లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, నాగార్జునసాగర్ డ్యామ్, పులిచింతల ప్రాజెక్టుల్లో తదుపరి విద్యుదుత్పత్తి నిలిపివేయాలని తెలంగాణ జెన్కో అధికారులకు సూచించింది. ఆయా ప్రాజెక్టుల నుంచి సాగు, తాగు అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని ఇరు రాష్ట్రాలు అంగీకరించినందువల్ల బోర్డు ఆదేశాలను పాటించాలని తెలిపింది. అపెక్స్ ఆమోదం లేకుండా ముందుకెళ్లొద్దు.. అలాగే అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆర్డీఎస్ కుడికాల్వ పనులను కొనసాగించరాదని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్‌లు అందజేయాలని.. బోర్డు, కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ముందుకెళ్లరాదని ఆదేశించిన విషయాన్ని దృష్టికి తెచ్చింది. ఈ మేరకు గురువారం బోర్డు ఏపీకి లేఖ రాసింది. ఇప్పటికే ఆర్డీఎస్ కుడి కాల్వ పనులపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు లేఖను దీంతో జత పరిచింది. ‘తెలంగాణ ప్రాజెక్టులను ఆపివేయించండి’ కేంద్ర సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులను ఆపివేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కృష్ణా బోర్డుకు విన్నవించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌ను సంఘం అధ్యక్షుడు ఏవీ గోపాలకృష్ణరావు, ప్రధాన కార్యదర్శి పి.రామాంజనేయరాజు వినతిపత్రం అందజేశారు. -
ట్విస్ట్ : శ్రీశైలం అగ్ని ప్రమాదంలో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యుట్ కారణమని అంతా భావిస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కొత్త బ్యాటరీలు అమర్చున్న తరణంలోనే అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. అర్దరాత్రి వేళ బ్యాటరీలు మార్చాల్సిన అవసరం ఏముంది..? బ్యాటరీలు అమర్చే సమయంలో జరిగిన పొరపాటే 9 మంది ప్రాణాలు బలితీసుకున్నాయా..? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు జన్కోలో పనిచేసి ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ ప్రమాదంపై సీఐడి విచారణ ముమ్మరం చేసింది. దర్యాప్తుకు కావాల్సిన పూర్తి స్థాయి ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఓ వైపు సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా..? లేక మానవ తప్పిదం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదంతా సాంకేతికమైన అంశం కావడంతో ప్రధానంగా యూనిట్ల పనితీరు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకోసం విద్యుత్ రంగ నిపుణుల సహకారం, ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఐతే సీఐడి విచారణ ఇలా కొనసాగుతుండగానే ప్రమాదం రోజుకో ఒకరమైన వాదనలు వెలుగు చూస్తున్నాయి. ఆ వాదనలు ప్రమాదం ముమ్మాటికి మానవ తప్పిదాలే కారణం అన్న ప్రచారం సాగుతుంది. (కొంపముంచిన అత్యవసర స్విచ్!) 220 కేవీకి డీసీ కరెంటు సరఫరాకు బ్యాటరీలు బిగించే సమయంలో ప్యానల్ బోర్డులో మంటలు వచ్చి అగ్ని ప్రమాదం జరిగిందని జన్కో ఉద్యాగులు భావిస్తున్నారు. జనరేటర్‌ను నియంత్రించే సెన్సార్ కు నేరుగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో లోడ్ పెరిగి మంటలు చెలరేగినట్టు అధికారులు అనుకుంటున్నారు. ప్రమాదం జరిగిన రోజున హైద్రాబాద్ జల సౌదాలో సీఈ స్థాయిలో ఉన్న ఓ అధికారి వచ్చి బ్యాటరీలను మార్పించే పనులను హడావిడిగా చేశారన్న గుసగులు వినిపిస్తున్నాయి. ఇక్కడ సీఈ ఉన్నా ఆయన ప్రమేయం లేకుండానే సదరు అధికారే నలుగురిని తీసుకువచ్చి బ్యాటరీ మార్పిడి కార్యక్రమం చేపట్టినట్టు సమాచారం. అక్కడ పనిచేస్తున్న డీఈ, ఏఈ హడాహుడి పనులపై అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా నేను చెప్పింది చేయాల్సిందేనని హుకుం జారీ చేసినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలో ఇక్కడి నుంచి బదిలీ ఐన ఓ డీఈ రిలీవ్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. బ్యాటరీలను మార్చాలని రెండేళ్ల క్రితమే ప్రతిపాదించినా... ఇంత జాప్యం జరగడం వెనక ఈ తతంగం నడిపిన సీఈ హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా అర్దరాత్రి సమయంలో హడావిడిగా బ్యాటరీల మార్పు వెనక కూడా ఈయన హస్తం ఉందని స్పష్టమౌతుంది. (శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ) ఐతే ఈ దారుణ ఘటనపై అనుమానాలు, వాదనలు, విమర్శలు ఎలా ఉన్నా... ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వం మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్ప లేదు. ప్రస్తుతం జల విద్యుత్ కేంద్రం మళ్లీ పూర్వ వైభవానికి నోచుకోవాలంటే వేల కోట్లకు పైగా ఖర్చు చెయ్యక తప్పని పరిస్థితి నెలకొంది. అంతే కాదు ప్రమాదానికి గురైన యూనిట్లలో కొన్ని పరికరాలను జపాన్ కు ఆర్డర్ పై తెప్పించాల్సి ఉండటంతో పునరుద్దరణకు నెలలు సమయం పట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా ఏది ఏమైనా పూర్తి స్థాయిలో విచారణ జరిగి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
‘విద్యుత్’లో మనమే టాప్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వాడకం విషయంలో అత్యధిక వృద్ధి శాతం నమోదు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 2017–18 సంవత్సరానికి విద్యుత్ రంగంలో వివిధ రాష్ట్రాలు సాధించిన పురోగతి వివరాలను కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) ప్రకటించింది. విద్యుత్ వినియోగంలో 13.62 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రం.. దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అదే సమయంలో దేశ సగటు వృద్ధి 6.11 శాతమే ఉంది. ఉత్తరప్రదేశ్ 11.92 శాతం వృద్ధి రేటుతో రెండో స్థానంలో, 7.43 శాతంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 7.40 శాతంతో మహారాష్ట్ర నాలుగో స్థానంలో నిలిచాయి. 2016–17లో తెలంగాణ రాష్ట్రంలో 53,017 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. 2017–18లో 60,237 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. దేశ సగటు వృద్ధి 6.11 శాతమే ఉంది. 2016–17 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 11,35,334 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. 2017–18లో 12,04,697 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అయింది. 2014లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగ వార్షిక వృద్ధి రేటు సగటు 6 శాతమే ఉండేది. చిమ్మచీకట్ల నుంచి వెలుగుల వైపు: కేసీఆర్ విద్యుత్ వినియోగంలో తెలంగాణ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల వ్యవధిలోనే రాష్ట్రం చిమ్మచీకట్ల నుంచి నిత్య వెలుగుల రాష్ట్రంగా మారిందని అన్నారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు అన్ని రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడంతో తెలంగాణ ఇప్పటికే యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వినియోగంలో అత్యధిక వృద్ధిరేటు తెలంగాణ పురోగమనాన్ని సూచిస్తోందని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సరైన ప్రణాళికా, చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ వల్ల విద్యుత్ సంస్థలు ఈ విజయం సాధించగలిగాయని అన్నారు. ప్రస్తుత డిమాండుకు తగిన సరఫరా చేస్తూనే రాబోయే కాలంలో వచ్చే డిమాండుకు అనుగుణంగా సరఫరా కోసం ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణ విద్యుత్ రంగంలో సాధిస్తున్న విప్లవాత్మక విజయాలు అన్ని రంగాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంలోనూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంలోనూ నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా పాత్ర ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు గర్వకారణం: ప్రభాకర్‌రావు విద్యుత్ రంగంలో సాధిస్తున్న ఫలితాలు తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సూచికని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ చాలా విషయాల్లో అగ్రగామిగా ఉండటం హర్షనీయమన్నారు. తెలంగాణకు ఇది గర్వకారణమని అన్నారు. ప్రగతికి, విద్యుత్ వినియోగానికి అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూనే, ఎక్కువ వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తూ రైతు సంక్షేమానికి విద్యుత్ శాఖ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. -
పోస్టులు వందల్లో.. దరఖాస్తులు లక్షల్లో
విద్యుత్ ఇంజనీర్ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులు పోటెత్తాయి. పోస్టులు ఉన్నది వందల సంఖ్యలోనైతే.. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యలో లక్షను దాటిపోయింది. 856 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం జెన్కో గత నెలలో దరఖాస్తులు ఆహ్వానించగా... ఏకంగా 1,09,308 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క ఎలక్ట్రానిక్స్ విభాగంలో చూస్తే ఉన్న పోస్టులు 70 కాగా.. ఏకంగా 37,078 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా దరఖాస్తు గడు వు బుధవారంతో ముగిసిపోగా, ఒక్కో పోస్టు కు 127 మంది పోటీ పడుతున్నారు. వచ్చే నెల 14న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎన్పీడీసీఎల్లో 35 వేల దరఖాస్తులు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లోనూ ఏఈ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. 164 ఏఈ పోస్టులకు 35,623 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరీల వారీగా చూస్తే 159 ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు 33,010 మంది, 3 ఏఈ (సివిల్) పోస్టులకు 1,316 మంది, 2 ఏఈ (సీఎస్/ఐటీ) పోస్టులకు 1,297 మంది పోటీ పడుతున్నారు. వచ్చే నెల 8న రాత పరీక్ష జరగనుంది. ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్లోనూ... ట్రాన్స్‌కో 206 ఏఈ (184 ఎలక్ట్రికల్, 22 సివిల్) పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా ఇప్పటి వరకు 47 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చే నెల 4వరకు గడువున్న నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. వచ్చే నెల 29న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఇక దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) 201 ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ప్రకటన చేయగా.. ఇప్పటివరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటికి దరఖాస్తు గడువు గురువారంతో ముగిసిపోనుండగా, వచ్చే నెల 22న రాత పరీక్ష జరుగుతుంది.