సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వాడకం విషయంలో అత్యధిక వృద్ధి శాతం నమోదు చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. 2017–18 సంవత్సరానికి విద్యుత్ రంగంలో వివిధ రాష్ట్రాలు సాధించిన పురోగతి వివరాలను కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) ప్రకటించింది. విద్యుత్ వినియోగంలో 13.62 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రం.. దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అదే సమయంలో దేశ సగటు వృద్ధి 6.11 శాతమే ఉంది. ఉత్తరప్రదేశ్ 11.92 శాతం వృద్ధి రేటుతో రెండో స్థానంలో, 7.43 శాతంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 7.40 శాతంతో మహారాష్ట్ర నాలుగో స్థానంలో నిలిచాయి. 2016–17లో తెలంగాణ రాష్ట్రంలో 53,017 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. 2017–18లో 60,237 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. దేశ సగటు వృద్ధి 6.11 శాతమే ఉంది. 2016–17 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 11,35,334 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగమైంది. 2017–18లో 12,04,697 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అయింది. 2014లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగ వార్షిక వృద్ధి రేటు సగటు 6 శాతమే ఉండేది.
చిమ్మచీకట్ల నుంచి వెలుగుల వైపు: కేసీఆర్
విద్యుత్ వినియోగంలో తెలంగాణ అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల వ్యవధిలోనే రాష్ట్రం చిమ్మచీకట్ల నుంచి నిత్య వెలుగుల రాష్ట్రంగా మారిందని అన్నారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు అన్ని రంగాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడంతో తెలంగాణ ఇప్పటికే యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వినియోగంలో అత్యధిక వృద్ధిరేటు తెలంగాణ పురోగమనాన్ని సూచిస్తోందని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సరైన ప్రణాళికా, చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ వల్ల విద్యుత్ సంస్థలు ఈ విజయం సాధించగలిగాయని అన్నారు. ప్రస్తుత డిమాండుకు తగిన సరఫరా చేస్తూనే రాబోయే కాలంలో వచ్చే డిమాండుకు అనుగుణంగా సరఫరా కోసం ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణ విద్యుత్ రంగంలో సాధిస్తున్న విప్లవాత్మక విజయాలు అన్ని రంగాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంలోనూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంలోనూ నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా పాత్ర ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణకు గర్వకారణం: ప్రభాకర్‌రావు
విద్యుత్ రంగంలో సాధిస్తున్న ఫలితాలు తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సూచికని జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ చాలా విషయాల్లో అగ్రగామిగా ఉండటం హర్షనీయమన్నారు. తెలంగాణకు ఇది గర్వకారణమని అన్నారు. ప్రగతికి, విద్యుత్ వినియోగానికి అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూనే, ఎక్కువ వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేస్తూ రైతు సంక్షేమానికి విద్యుత్ శాఖ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
‘విద్యుత్’లో మనమే టాప్
Published Sat, Nov 3 2018 2:59 AM | Last Updated on Sat, Nov 3 2018 3:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment