ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి తక్షణమే విద్యుదుత్పత్తి నిలిపివేయాలని తెలంగాణను కృష్ణా బోర్డు ఆదేశించింది. తెలంగాణ విద్యుదుత్పత్తితో తమ రాష్ట్ర తాగు, సాగు ప్రయోజ నాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్పందించిన బోర్డు గురువారం తెలంగాణకు లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం, నాగార్జునసాగర్ డ్యామ్, పులిచింతల ప్రాజెక్టుల్లో తదుపరి విద్యుదుత్పత్తి నిలిపివేయాలని తెలంగాణ జెన్‌కో అధికారులకు సూచించింది. ఆయా ప్రాజెక్టుల నుంచి సాగు, తాగు అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని ఇరు రాష్ట్రాలు అంగీకరించినందువల్ల బోర్డు ఆదేశాలను పాటించాలని తెలిపింది.
అపెక్స్ ఆమోదం లేకుండా ముందుకెళ్లొద్దు..
అలాగే అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా ఆర్డీఎస్ కుడికాల్వ పనులను కొనసాగించరాదని కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన డీపీఆర్‌లు అందజేయాలని.. బోర్డు, కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ముందుకెళ్లరాదని ఆదేశించిన విషయాన్ని దృష్టికి తెచ్చింది. ఈ మేరకు గురువారం బోర్డు ఏపీకి లేఖ రాసింది. ఇప్పటికే ఆర్డీఎస్ కుడి కాల్వ పనులపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు లేఖను దీంతో జత పరిచింది.
‘తెలంగాణ ప్రాజెక్టులను ఆపివేయించండి’
కేంద్ర సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులను ఆపివేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కృష్ణా బోర్డుకు విన్నవించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్‌ను సంఘం అధ్యక్షుడు ఏవీ గోపాలకృష్ణరావు, ప్రధాన కార్యదర్శి పి.రామాంజనేయరాజు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment