సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో ఏర్పాట్లు ఎలా ఉన్నా.. మందుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడింది. మేడారం పరిసర ప్రాంతాల్లో వారం రోజుల పాటు తాత్కాలిక బార్లకు అనుమతి ఇచ్చింది. ఎమ్మా ర్పీ నిబంధనలను సడలించి దుకాణదారుడు ఇష్టం వచ్చిన ధరకు మద్యం అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. గిరిజనుల పేర్ల మీద గిరిజనేతర లిక్కర్ మాఫియా ఈ బార్లను దక్కించుకుంది.
రోజుకు రూ.9 వేల లైసెన్స్ ఫీజు
మేడారం జాతరలో ఈవెంట్ పర్మిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 22 తాత్కాలిక బార్లను అనుమతించింది. రోజుకు రూ.9 వేల లైసెన్స్ ఫీజుతో స్థానిక గిరిజనుల పేరు మీద వీటిని ఇచ్చింది. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వారం రోజులపాటు వీటిని నిర్వహించుకోవచ్చు. మేడారం, మేడారం చెరువు, నార్లపూర్, ఊరట్టం, కన్నెపల్లి, ఎల్బాక క్రాస్ రోడ్డు, రెడ్డిగూడెం, కొత్తూరు, చింతల్ క్రాస్ రోడ్డు తదితర గ్రామాల పరిధిలో బార్లను అనుమతించింది. వాస్తవిక మద్యం ధర మీద 30 శాతం అదనపు రేటుతో టీఎస్‌బీసీఎల్ తాత్కిలిక బార్లకు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం నుంచే ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు, ఎమ్మార్పీ ధరకే మద్యం విక్రయిస్తే వారికి గిట్టుబాటు కాదు కాబట్టి.. ఆ నిబంధన ఎత్తివేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
ఒక్క రోజులో రూ.2.5 కోట్ల మద్యం విక్రయం
వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకే మద్యం దుకాణాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో గిరిజనేతర లిక్కర్ మాఫియా స్థానిక గిరిజనుల పేరు మీద బార్లను దక్కించుకుంది. దీనికి ఎమ్మార్పీ నుంచి సడలింపు ఉండటంతో ఇష్టం వచ్చిన కాడికి దండుకుంటున్నారు. 28న అనుమతి పొందిన దుకాణాలు 29వ తేదీ ఒక్కరోజే రూ.2.5 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన జాతర జరిగే రోజుల్లో భారీగా లిక్కర్ వ్యాపారం జరగవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు స్థానిక మద్యం డిపోల్లో ప్రజలు ఎక్కువగా తాగే మద్యం బ్రాండ్లకు ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు.
తాగినోళ్లకు తాగినంత!
Published Tue, Jan 30 2018 2:17 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment