‘యాదాద్రి’లో శిల్పకళా సౌందర్యం
సాక్షి, హైదరాబాద్: ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో... అంటూ ‘అమర శిల్పి జక్కన్న’ అప్పుడెప్పుడో పాడుకున్నాడు. ఇప్పుడు ఒకరు ఇద్దరు కాదు... ఏకంగా ఐదొందల మంది ‘జక్కన్న’లు నల్లరాళ్లను అద్భుత శిల్పాలుగా మలిచేందుకు సిద్ధమయ్యారు. వారి ఉలి స్పర్శతో అందమైన ఆకృతుల్లో ఒదిగిపోయేందుకు నల్ల రాళ్లూ వస్తున్నాయి. లక్ష్మీనరసింహుడు కొలువైన యాదాద్రి కొండకు కొత్త రూపునిచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. దాదాపు ఏడాదిన్నరపాటు పనులు జరగనుండటంతో అప్పటి వరకు ప్రధాన ఆలయంలోని స్వయంభూ మూలవిరాట్టును ద ర్శించుకునే అవకాశం ఉండదు. భక్తుల దర్శనం కోసం ఆ పక్కనే ప్రత్యేకంగా బాలాలయాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 21న బాలాలయంలో జీయర్‌స్వామి ఆధ్వర్యంలో ఉత్సవమూర్తుల ప్రతిష్టాపన జరగనుంది. ఆ తర్వాత యాదాద్రిని తీర్చి దిద్దే పనులు మొదలవుతాయి.
ఇంటర్‌లాకింగ్ పరిజ్ఞానం...
ఈ చారిత్రక ఆలయానికి గతంలో ఎన్నడూ జరగని రీతిలో పునర్నిర్మాణ పనులు చేపడుతున్న ప్రభుత్వం... మళ్లీ కొన్ని శతాబ్దాల వరకు అది చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. దీన్ని గమనంలో ఉంచుకుని సిమెంటు కాంక్రీటు కాకుండా రాతితో పనులు చేయాలని నిర్ణయించింది. రెండొందల సంవత్సరాల పాటు ఈ నిర్మాణాలు స్థిరంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. రాళ్లు ఒకదానికొకటి పట్టుకుని ఉండేలా ఇంటర్‌లాకింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. భారీఎత్తున రాతి పని ఉన్నందున ఐదొందల మంది శిల్పులను వినియోగించబోతున్నారు. ఏపీలోని ఆళ్లగడ్డ ప్రాంతం నుంచి కొందరు, ఒరిస్సా, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి మిగతావారు ఈ క్రతువులో పాలుపంచుకోబోతున్నారు. కొత్తగా నిర్మించే దేవాలయాలకు సిమెంటునే వినియోగిస్తున్నందున వాటిల్లో ‘చారిత్రక’ రూపు కనిపించటం లేదు. కొంతకాలానికి సిమెంటు ఆకృతులు దెబ్బతిని సుందర రూపు కోల్పోతున్నాయి. దీంతో చూడగానే అలనాటి నిర్మాణం అనిపించేలా యాదాద్రి పనుల్లో రాతినే వినియోగిస్తున్నారు.
80 అడుగుల మహారాజగోపురం...
తిరుమల తరహాలో యాదాద్రిలో మాడ వీధులను నిర్మించనున్నారు. గుట్ట అంచును ఆనుకుని మహా ప్రాకారం నిర్మిస్తారు. దాదాపు 80 అడుగుల ఎత్తుతో మహా రాజగోపురం.. మరో ఆరు గాలిగోపురాలు రూపుదిద్దుకోనున్నాయి. ఈ మొత్తం పనిలో సిమెంటు కాంక్రీటు జోలికి వెళ్లకూడదని, అలనాటి నిర్మాణాల్లా సహజత్వం ప్రతిబింబించేలా రాళ్లతోనే నిర్మించాలని నిర్ణయించారు. అందుకు పటిష్టంగా ఉండే నల్ల గ్రానైట్‌ను ఎంపిక చేశారు. అలాంటి రాళ్లకోసం శిల్పులు అన్వేషించి గుంటూరు, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గుర్తించారు. వాటి నాణ్యత తెలుసుకునేందుకు జేఎన్‌టీయూ, వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం, నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌లలోని పరిశోధనశాలల్లో పరీక్షించారు. అనుకూలంగా ఉన్నాయని తాజాగా నివేదిక రావటంతో ఆయా ప్రాంతాల నుంచి బ్లాక్ గ్రానైట్‌ను తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.