యాదాద్రికి ఎంఎంటీఎస్‌పై ముందడుగు
సీఎస్‌తో రైల్వే జీఎం చర్చలు
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి పుణ్య క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ఎంఎంటీఎస్‌ను రాయగిరి రైల్వే స్టేషన్ వరకు పొడిగించే అంశంపై మరో అడుగు ముందుకు పడింది. దక్షిణమధ్య రైల్వే జనరల్‌మేనేజర్ రవీంద్రగుప్తా శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో ఈ విషయమై చర్చించారు. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టుతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న పలు ప్రాజెక్టుల పురోగతి, ప్రతిపాదనల గురించి సీఎస్‌కు వివరించారు. యాదాద్రికి వెళ్లే భక్తుల కోసం ఎంఎంటీఎస్ రైలు సదుపాయాన్ని రాయగిరి వరకు పొడిగించాలని, ఇందుకు తగిన నిధులను అందజేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ రైల్వే శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రవీంద్రగుప్తా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. శివార్లను కలుపుతూ ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు కొనసాగుతున్నాయి. మౌలాలీ నుంచి ఘట్‌కేసర్ వరకు రెండో దశ నిర్మించనున్న దృష్ట్యా ఈ లైన్‌ను రాయగిరి వరకు పొడిగించాలని సీఎం ప్రతిపాదించారు. సనత్‌నగర్- పటాన్‌చెరు, ఫలక్‌నుమా-ఉందానగర్, అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్‌ను విస్తరించేందుకు రెండో దశ ప్రాజెక్టు చేపట్టారు. ఈ పనుల పురోగతిపై ఉన్నతాధికారులు ఇరువురూ సుదీర్ఘ చర్చ జరిపినట్లు తెలిసింది. రెండో దశ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడమే కాకుండా యాదాద్రికి వెళ్లే భక్తుల కోసం రాయగిరి వరకు పొడిగించే అంశంపైనా చర్చించారు. అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి అయ్యే వ్యయం, కాలపరిమితి వంటి అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి.
చర్లపల్లిలో రైల్వే టెర్మినల్
నగరంలో రవాణా సదుపాయాలను పెంపొందించేందుకు వీలుగా బస్, రైల్వే స్టేషన్లను విస్తరించనున్నట్లు రెండు రోజుల క్రితం సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చర్లపల్లి, వట్టినాగులపల్లిలో నిర్మించ తలపెట్టిన భారీ రైల్వే టెర్మినల్స్‌పై అధికారులు చర్చలు జరిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై రైళ్ల ఒత్తిడి బాగా పెరిగిన దృష్ట్యా అదనపు టెర్మినళ్లను నిర్మించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ మేరకు జీఎం రవీంద్రగుప్తా తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను సందర్శించి టెర్మినల్ నిర్మాణానికి కావలసినంత స్థలం అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు.