సవాళ్లకు సిద్ధంగా ఉండండి | Arun Jaitley in IPS passing out Parade at hyderabad | Sakshi
Sakshi News home page

సవాళ్లకు సిద్ధంగా ఉండండి

Published Sat, Oct 29 2016 2:54 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

సవాళ్లకు సిద్ధంగా ఉండండి

సవాళ్లకు సిద్ధంగా ఉండండి

శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులతో అరుణ్ జైట్లీ
మానవాళికి ఉగ్రవాదం పెనుశాపంగా మారింది
ఆధునిక పరిజ్ఞానంతో నేరాలకు చెక్ పెట్టాలని సూచన
109 మంది ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్

సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో మానవతా దృ క్పథం, నిష్పక్షపాతం, ప్రతిభ ప్రదర్శించిన వారే ఉత్తమ పోలీసు అధికారులుగా నిలిచిపోతారని యువ ఐపీఎస్ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హితబోధ చేశారు. మానవాళికి పెనుశాపంగా మారిన ఉగ్రవాదంపై పోరాటం వంటి సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా వంటి నేరాలను ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో సహాయంతో నియంత్రించేందుకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో శుక్రవారం 68వ బ్యాచ్  ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది.

ఈ కార్యక్రమంలో అరుణ్ జైట్లీ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. ‘‘శిక్షణ నుంచి బయటకు అడుగు పెట్టిన మరుక్షణం నుంచీ విశ్వసనీయతే మీ అత్యున్నత ప్రాధాన్యం కావాలి. వృత్తిలో పనితీరును నిర్ణయించుకోవడానికి విశ్వసనీయతే గీటురాయి. నూతనోత్సాహంతో సమాజ సేవకు సిద్ధమవుతున్న మీకు విజయం వెన్నంటే ఉంటుందని ఆకాంక్షిస్తున్నా.. విధి నిర్వహణలో కొన్నిసార్లు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో అర్థం కాని గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు నేరుగా మీ ముందు ఉన్న ఉత్తమమైన దారిని ఎంచుకోవడమే తెలివైన పని. దగ్గరి మార్గాలు తాత్కాలిక ఊరట కలిగించినా.. వాటితో శాశ్వత విజయాలు లభించవు..’’ అని యువ ఐపీఎస్‌లకు జైట్లీ సూచించారు.

ఆకట్టుకున్న కవాతు...
కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకుని బయటకు వెళ్తున్న ట్రైనీ ఐపీఎస్‌లకు అకాడమీ డెరైక్టర్ అరుణా బహుగుణ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బ్యాచ్‌లో బెస్ట్ ఆల్‌రౌండ్‌గా నిలిచిన రిషికేష్ భగవాన్ సోనావాలే నేతృత్వంలో ట్రైనీ ఐపీఎస్‌లు నిర్వహించిన కవాతు ఆహూతులను కట్టిపడేసింది. 109 ఐపీఎస్ శిక్షణార్థులతో పాటు నేపాల్ పోలీస్ సర్వీసెస్ నుంచి ఐదుగురు, రాయల్ భూటాన్ పోలీస్ సర్వీసెస్ నుంచి ఆరుగురు, మాల్దీవియన్ పోలీస్ సర్వీసెస్ శిక్షణార్థులు నలుగురు కలిపి... 2015కి చెందిన ఈ బ్యాచ్‌లో మొత్తం 124 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన ట్రైనీ అధికారులకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ట్రోఫీలు, ఇతర పురస్కారాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement