చాదర్‌ఘాట్: లక్షల విలువ చేసే నగలు చోరీకి గురైన గంటల వ్యవధిలో పోలీసులు రికవరీ చేసిన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13న ఓల్డ్ మలక్‌పేటకు చెందిన లాయక్ ఉన్నీసా బేగం ఇంటికి ఆమె సమీప బంధువు నజియా బేగం వచ్చింది. ఈ సందర్భంగా లాయక్ ఉన్నిసా ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలను తీసి నజియాకు చూపింది. అనంతరం వాటిని బీరువాలో పెట్టి తాళం వేయకుండా పనిమీద బయటకు వెళ్లింది. దీనిని అవకాశంగా తీసుకున్న నజియాబేగం నగలను తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి పది గంటల సమయంలో బీరువాను తెరిచి చూసిన లాయక్ ఉన్నీసా నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నజియాను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. నగలు కాజేసిన నదియా తనపై అనుమానం రాకుండా ఉండేందుకు చోరీ జరిగిన ఇంట్లోని బాత్‌రూంలో కమోడ్‌లో చోరీ సొత్తును దాచింది. పోలీసులు ఆమెతోనే వాటిని వెలికి తీయించి స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సత్తయ్య తెలిపారు.