గడువు నాటికి ఓటరు కార్డులు హులక్కే..?
=తుది జాబితా గడువు జనవరి 16
=గ్రేటర్‌లో 2 నెలల్లో అందిన దరఖాస్తులు 5.5 లక్షలు
సాక్షి, సిటీబ్యూరో : ఓటుహక్కుపై గత కొంతకాలంగా జరుగుతున్న విస్తృత ప్రచారం.. వివిధ సంస్థలు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు.. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుపు.. తదితర అంశాల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు తహతహలాడుతున్నారు. కొత్త, యువ ఓటర్లలో ఈ ఆసక్తి మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఓటుహక్కు ఉన్నవారు ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో, గల్లంతైందో తెలుసుకొని.. లేకుంటే తిరిగి నమోదుకు దరఖాస్తు చేస్తున్నారు.
ఇక, పద్దెనిమిదేళ్లు నిండినవారు ఓటు హక్కుపై ఆసక్తి కనబరుస్తూ దరఖాస్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉండటంతో గ్రేటర్ పరిధిలో మెజారిటీ పౌరులు ఆన్‌లైన్‌నే వినియోగిస్తున్నారు. అయితే గుట్టలుగుట్టలుగా వస్తున్న దరఖాస్తుల్ని అధికారులు సకాలంలో పరిశీలించ లేకపోతున్నారు. ఆన్‌లైన్ ఇబ్బందులున్నప్పటికీ.. గత రెండు నెలల్లోనే ఐదులక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించి.. వచ్చేనెల 16వ తేదీ నాటికి ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితా వెలువరించాల్సి ఉంది. గత రెండు నెలల్లో అందిన దరఖాస్తుల్లో కేవలం రెండు శాతం దరఖాస్తుల్ని మాత్రమే పరిశీలించారు. మిగిలిన నెల గడువులో మిగతా 98 శాతం దరఖాస్తుల్ని పరిశీలించి ఓటరు కార్డులు జారీ చేయడం అసాధ్యమనే చెప్పాలి.
పెండింగ్‌లోనే 5.4 లక్షల దరఖాస్తులు
జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 18 వరకు ఓటరు గుర్తింపు కార్డు కోసం 5,53,207 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిల్లో 5,42,157 మంది ఓటర్లకు కార్డులు జారీ చేస్తారో, లేదో తెలియక పెండింగ్‌లో ఉంచారు. ఎక్కువమంది ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో.. ఆన్‌లైన్‌లో వాటిని పరిశీలించి.. ధ్రువీకరణకు ఓటర్ల ఇళ్లకు వెళ్లి.. నిజమని నిర్ధారించుకున్నాకే ఓటరు కార్డులు జారీ చేయాల్సి ఉంది. ఈ తతంగమంతా పూర్తయ్యేందుకు ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి.
ఈ నేపథ్యంలో.. ఓటర్ల జాబితా వెలువరించాల్సిన జనవరి 16 నాటికి వీరికి గుర్తింపుకార్డులు వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పొచ్చు. గ్రేటర్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో ఓటరు గుర్తింపుకార్డుల కోసం అందిన దరఖాస్తులు.. పెండింగ్ లోని వివరాలు పట్టికలో పేర్కొన్న విధంగా ఉన్నాయి. పటాన్‌చెరు, మహేశ్వరం నియోజకవర్గాల్లోని కొంత భాగం మాత్రమే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నందున ఆ రెండు నియోజకవర్గాల్లోని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోలేదు.
ఆదివారం మరో అవకాశం
ఈ నెల 22న గ్రేటర్‌లోని అన్ని బూత్‌లలో ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. దరఖాస్తులు అందజేసేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచారం నిర్వహిస్తోంది.
గడువు లోపే కార్డులు
5000 మంది బూత్ లెవెల్ అధికారులు ఓట్ల పరిశీలన కార్యక్రమంలో నిమగ్నమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు లోపే ఓటరు కార్డులు జారీ చేస్తాం.
- నవీన్ మిట్టల్, ఎన్నికల సంఘం కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి
ఆందోళన వద్దు.. కార్డులిస్తాం
నిర్ణీత గడువులోగా ఓటరు కార్డులు జారీ చేస్తాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇంకా దరఖాస్తు చేసుకోని వారుంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 23 వరకు గడువుంది. సంశయించాల్సిన పనేం లేదు.
- భన్వర్‌లాల్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి