దసరా తర్వాతే అసెంబ్లీ
అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలను దసరా తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు అసెంబ్లీని ప్రొరోగ్ చేయనుంది. అధికారికం గా ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు అసెంబ్లీ వర్గాలు సన్నద్ధమయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం కావ డం, బతుకమ్మ సంబురాలు, దసరా సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం ఇందుకు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. గతనెల 30న సమావేశమైన అసెంబ్లీ, కౌన్సిల్ తొలి రోజునే జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. వినాయక నిమజ్జనోత్సవాల తర్వాత అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఈ నెల చివరి వారంలో సమావేశాలు నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం కావటంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. అన్ని శాఖల్లో ఉన్నతాధికారులందరూ జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విజయ దశమి రోజున కొత్తగా 27 జిల్లా కేంద్రాల నుంచి పరిపాలనను ప్రారంభించనుంది. వీటితో పాటు బతుకమ్మ సంబరాలు, దసరా సెలవులున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
ఆర్డినెన్స్‌లకు లైన్ క్లియర్...
ప్రధానంగా కీలకమైన మూడు ఆర్డినెన్స్‌లను వీలైనంత తొందరగా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టుల భూసేకరణకు రాష్ట్రంలో ప్రత్యేకంగా చట్టం చేయాలని నిర్ణయించింది. ఇటీవలే అందుకు సంబంధించి కసరత్తు చేసేందుకు సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఉన్నతాధికారుల కమిటీని నియమించిం ది. తాజాగా తెలంగాణలో రాష్ట్ర బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిల్లులు ప్రవేశపెట్టి ఆమో దం పొందడం ఆలస్యమవుతుందని ప్రభుత్వం అప్రమత్తమైంది.
నెలాఖరులోగా వీటిని అమల్లోకి తీసుకురావాల్సి ఉందని, అందుకే ఆర్డినెన్స్‌లు జారీ చేయడమే సరైం దని భావిస్తోంది. ఈనెల 26న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అందులో ఈ మూడు అంశాలను చర్చించి ఏకాభిప్రాయంతో గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని యోచిస్తోంది. కానీ అసెంబ్లీ నిరవధిక వాయిదాలో (సైనడై) ఉన్న వ్యవధిలో ఆర్డినెన్స్‌లు జారీ చేయటం చట్ట రీత్యా కుదరదు. దీంతో న్యాయ నిపుణులు చేసిన సూచనల మేరకు అసెంబ్లీని ప్రొరోగ్ చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ఆమోదంతో అందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది.