prorog
-
అసెంబ్లీ ప్రొరోగ్
ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిని, శాసనసభను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 10న 2017–18 వార్షిక బడ్జెట్ సమావేశాలు (ఏడో సెషన్) మొదలవగా మార్చి 27 వరకు 13 రోజుల పాటు శాసనసభ నడిచింది. మండలి 9 రోజుల పాటు సాగింది. తిరిగి ఏప్రిల్ 16న (ఏడో సెషన్ రెండో సమావేశం), ఏప్రిల్ 30న (ఏడో సెషన్ మూడో సమావేశం) రెండు ప్రత్యేక సమావేశాలు కూడా జరిగాయి. మూడు పర్యాయాలు సభ నిరవధికంగా వాయిదా పడగా.. మంగళవారం శాసన సభ, మండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
శాసనసభ ప్రొరోగ్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలను ప్రభుత్వం ప్రొరోగ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ ఎనిమిదో సమావేశాలను, శాసనమండలి 27వ సమావేశాలను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదేశాల మేరకు ప్రొరోగ్ చేసినట్లు రాష్ట్ర శాసనసభ ఇన్చార్జ్ కార్యదర్శి కె.సత్యనారాయణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల పదోతేదీన అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డప్పటికీ గవర్నర్ అనుమతితో ప్రభుత్వం ప్రొరోగ్ నోటిఫికేషన్ జారీ చేసేవరకూ సాంకేతికంగా వాయిదా పడ్డట్లు కాదు. సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఆర్డినెన్సులు జారీ చేయడానికి వీలుకాదు. అందువల్లే ప్రభుత్వం అసెంబ్లీని, కౌన్సిల్‌ను ప్రొరోగ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
దసరా తర్వాతే అసెంబ్లీ
అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలను దసరా తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకు అసెంబ్లీని ప్రొరోగ్ చేయనుంది. అధికారికం గా ఈ నోటిఫికేషన్ జారీ చేసేందుకు అసెంబ్లీ వర్గాలు సన్నద్ధమయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం కావ డం, బతుకమ్మ సంబురాలు, దసరా సెలవుల నేపథ్యంలో ప్రభుత్వం ఇందుకు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. గతనెల 30న సమావేశమైన అసెంబ్లీ, కౌన్సిల్ తొలి రోజునే జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. వినాయక నిమజ్జనోత్సవాల తర్వాత అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నెల చివరి వారంలో సమావేశాలు నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం కావటంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. అన్ని శాఖల్లో ఉన్నతాధికారులందరూ జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విజయ దశమి రోజున కొత్తగా 27 జిల్లా కేంద్రాల నుంచి పరిపాలనను ప్రారంభించనుంది. వీటితో పాటు బతుకమ్మ సంబరాలు, దసరా సెలవులున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఆర్డినెన్స్‌లకు లైన్ క్లియర్... ప్రధానంగా కీలకమైన మూడు ఆర్డినెన్స్‌లను వీలైనంత తొందరగా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టుల భూసేకరణకు రాష్ట్రంలో ప్రత్యేకంగా చట్టం చేయాలని నిర్ణయించింది. ఇటీవలే అందుకు సంబంధించి కసరత్తు చేసేందుకు సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన ఉన్నతాధికారుల కమిటీని నియమించిం ది. తాజాగా తెలంగాణలో రాష్ట్ర బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిల్లులు ప్రవేశపెట్టి ఆమో దం పొందడం ఆలస్యమవుతుందని ప్రభుత్వం అప్రమత్తమైంది. నెలాఖరులోగా వీటిని అమల్లోకి తీసుకురావాల్సి ఉందని, అందుకే ఆర్డినెన్స్‌లు జారీ చేయడమే సరైం దని భావిస్తోంది. ఈనెల 26న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అందులో ఈ మూడు అంశాలను చర్చించి ఏకాభిప్రాయంతో గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్‌లు జారీ చేయాలని యోచిస్తోంది. కానీ అసెంబ్లీ నిరవధిక వాయిదాలో (సైనడై) ఉన్న వ్యవధిలో ఆర్డినెన్స్‌లు జారీ చేయటం చట్ట రీత్యా కుదరదు. దీంతో న్యాయ నిపుణులు చేసిన సూచనల మేరకు అసెంబ్లీని ప్రొరోగ్ చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ఆమోదంతో అందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. -
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రొరోగ్
కేబినెట్ అనూహ్య నిర్ణయం న్యూఢిల్లీ: అనూహ్యంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రొరోగ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి సంబంధించి రాజకీయ సంక్షోభం నెలకొనడం, ప్రస్తుతం ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఏప్రిల్ 1 తరువాత అక్కడి ప్రభుత్వ వ్యయానికి అందించే నిధులకు సాధికారత అందించేందుకు కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆర్డినెన్స్ జారీ కుదరదు కనుక.. బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలని మంగళవారం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) నిర్ణయించింది. సీసీపీఏ భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి, ఈ వివరాలను ఆయనకు విన్నవించారు. అనంతరం మంగళవారం రాత్రి పార్లమెంటు ప్రొరోగ్ ఆదేశాలను రాష్ట్రపతి జారీ చేశారు. లోక్‌సభ సమావేశాలు జరగని సమయంలో.. రాష్ట్రాల వ్యయాల నిమిత్తం సంచిత నిధి నుంచి రాష్ట్రపతి నిధులను మంజూరు చేయొచ్చు. ఇది రాజ్యాంగంలోని 357(1) అధికరణ రాష్ట్రపతికి ఇచ్చిన అధికారం. పార్లమెంటు తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు జరిగిన విషయం తెలిసిందే. మలి దశ సమావేశాలు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కానుండగా, బడ్జెట్ సమావేశాలను ప్రొరోగ్ చేశారు. దీంతో పార్లమెంటు సమావేశాలను మళ్లీ ప్రారంభించాలంటే మరోసారి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. శత్రు ఆస్తుల చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీకి వీలుగా.. రాజ్యసభ సమావేశాలను సైతం నిరవధికంగా వాయిదా వేయాలన్న ప్రతిపాదనకూ సీసీపీఏ ఆమోదం తెలిపింది.