అనూహ్యంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రొరోగ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
కేబినెట్ అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: అనూహ్యంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రొరోగ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి సంబంధించి రాజకీయ సంక్షోభం నెలకొనడం, ప్రస్తుతం ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఏప్రిల్ 1 తరువాత అక్కడి ప్రభుత్వ వ్యయానికి అందించే నిధులకు సాధికారత అందించేందుకు కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆర్డినెన్స్ జారీ కుదరదు కనుక.. బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలని మంగళవారం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) నిర్ణయించింది.
సీసీపీఏ భేటీ అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి, ఈ వివరాలను ఆయనకు విన్నవించారు. అనంతరం మంగళవారం రాత్రి పార్లమెంటు ప్రొరోగ్ ఆదేశాలను రాష్ట్రపతి జారీ చేశారు. లోక్‌సభ సమావేశాలు జరగని సమయంలో.. రాష్ట్రాల వ్యయాల నిమిత్తం సంచిత నిధి నుంచి రాష్ట్రపతి నిధులను మంజూరు చేయొచ్చు. ఇది రాజ్యాంగంలోని 357(1) అధికరణ రాష్ట్రపతికి ఇచ్చిన అధికారం. పార్లమెంటు తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు జరిగిన విషయం తెలిసిందే. మలి దశ సమావేశాలు ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం కానుండగా, బడ్జెట్ సమావేశాలను ప్రొరోగ్ చేశారు. దీంతో పార్లమెంటు సమావేశాలను మళ్లీ ప్రారంభించాలంటే మరోసారి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. శత్రు ఆస్తుల చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీకి వీలుగా.. రాజ్యసభ సమావేశాలను సైతం నిరవధికంగా వాయిదా వేయాలన్న ప్రతిపాదనకూ సీసీపీఏ ఆమోదం తెలిపింది.