‘ఫ్యాన్సీ’ ఫ్రాడ్!
ఆకర్షణీయమైన సెల్‌ఫోన్ నెంబర్ల పేరుతో టోకరా
వారం రోజుల్లో 14 మంది నుంచి రూ.5 లక్షలు స్వాహా
సూత్రధారి ఏపీకి చెందిన వ్యక్తిగా అనుమానం
సిటీబ్యూరో: ఫ్యాన్సీ నెంబర్లంటే చాలా మందికి క్రేజ్... న్యూమరాలజీ అంటే మరికొందరికి నమ్మకం... అందుకే ఆర్టీఏ నిర్వహించే వేలంలో కొన్ని నెంబర్లు భారీ రేటు పలుకుతుంటాయి... సరిగ్గా ఇదే అంశాన్ని క్యాష్ చేసుకున్నాడో ఏపీ వాసి. ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నెంబర్లు తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ నగరంలోని అనేక మంది కి సంక్షిప్త సందేశాలు పంపాడు. స్పందించిన వారి నుం చి ఆన్‌లైన్‌లో అందినకాడికి దండుకున్నాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ తరహా నేరాలకు సం బంధించి వారం రోజుల్లో 14 ఫిర్యాదులు అందాయి. ప్రాథమిక ఆధారాలు ప్రకారం ఈ స్కామ్‌కు సూత్రధారి ఒక్కరేనని గుర్తించినట్లు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ రియాజుద్దీన్ తెలిపారు.
డిస్కౌంట్ సేల్ పేరుతో ఎర...
ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్, సైబరాబాద్‌లోని అనేక మంది సెల్‌ఫోన్ వినియోగదారులకు అనేక ఫ్యాన్సీ, వీఐపీ సెల్‌ఫోన్ నెంబర్లు విక్రయిస్తున్నట్టు ఎస్సెమ్మెస్‌లు వచ్చాయి. సాధారణంగా ఇలాంటి ప్రీమియం నెంబర్ల ను ఆయా కంపెనీలో వేలం ద్వారా విక్రయిస్తుంటాయి. అయితే రేట్లు మాత్రం భారీగా ఉంటాయి. ఈ సందేశా లు పంపిన వ్యక్తి మాత్రం తనను సంప్రదించిన వారితో ఆక్షన్‌లో అమ్మగా మిలిగిన నెంబర్లు తాము ఖరీదు చేశామని, డిస్కౌంట్‌లో విక్రయిస్తున్నామంటూ నమ్మబలికా డు. దీంతో అనేకమంది ఆకర్షితులయ్యారు.
బాధితులంతా విద్యాధికులే...
ఆయా ఫ్యాన్సీ నెంబర్లు కావాలంటే తాను చెప్పిన బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేయాలని చెప్పాడు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్‌లకు చెందిన అనేక మంది ఆ వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు జమ చేశారు. డబ్బు డిపాజిట్/ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. సంక్షిప్త సందేశం పంపడం, సంప్రదింపులు జరపడానికి వినియోగించిన సెల్‌ఫోన్ కూడా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గుర్తించి బాధితుల్లో 14 మంది వారం రోజుల వ్యవధిలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. వీరంతా విద్యాధికులు, ఎగువ మధ్యతరగతికి చెందిన వారే కావడం గమనార్హం.
ఏపీ కేంద్రంగా సాగిన దందా...
బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక ఆధారాలను బట్టి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఈ దందా జరిగిందని, ఒకే వ్యక్తి సూత్రధారని గుర్తించారు. నేరగాడు వినియోగించిన సెల్‌ఫోన్ నెంబర్ విజయవాడ సమీపంలోని చిరునామాతో రిజిస్టరై ఉన్నట్లు తేలింది. బాధితుల నుంచి నగదు డిపాజిట్/ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడానికి ఉపయోగించిన ఖాతా తిరుపతిలోని ఓ బ్యాంకులో తెరిచినట్లు గుర్తించారు. బాధితులతో సైబర్ నేరగాడు తెలుగులో మాట్లాడటంతో పాటు ఈ ఆధారాల నేపథ్యంలో ఆ రాష్ట్రంపై దృష్టిపెట్టి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సెల్‌ఫోన్‌లో తప్పుడు వివరాలు, చిరునామాతో తీసుకున్న ప్రీయాక్టివేటెడ్ సిమ్‌కార్డు వాడి ఉంటారని, బ్యాంకు ఖాతా సైతం డమ్మీ వ్యక్తులదో, దళారులదో అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఎవరూ సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించలేదు:
ప్రీమియం నెంబర్లుగా పిలిచే ఫ్యాన్సీ నెంబర్లను ఆయా సర్వీస్ ప్రొవైడర్లే వేలం ద్వారా విక్రయిస్తారు. ఈ 14 మంది బాధితుల్లో ఏ ఒక్కరూ తమకు వచ్చిన ఎస్సెమ్మెస్ నిజమేనా అనే అంశాన్ని సర్వీసు ప్రొవైడర్లు, డీలర్లను సంప్రదించి నిర్థారించుకోలేదు. మరోపక్క ఫ్యాన్సీ నెంబర్ల క్రయవిక్రయ లావాదేవీలన్నీ ఆయా సర్వీసు ప్రొవైడర్ల అధికారిక ఖాతా ద్వారానే జరుగుతాయి. ఇక్కడ వ్యక్తిగత ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయమని నిందితుడు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ తరహా నేరాలకు ప్రజలు అప్రమత్తతోనే పూర్తిస్థాయిలో చెక్ చెప్పగలం. - మహ్మద్ రియాజుద్దీన్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్, సైబరాబాద్