సింగపూర్ కంపెనీలదే పెత్తనం!
♦ రాజధాని నిర్మాణంలో ఒప్పందాలు, కేబినెట్ నిర్ణయాలకు మంగళం
♦ సీడ్ క్యాపిటల్ ఏరియా 20 చదరపు కిలోమీటర్లకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతి మాస్టర్ ప్రణాళిక అమలు వ్యవహారం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు, సర్కారు పెద్దల ఇష్టారాజ్యంగా మారిపోయింది. సింగపూర్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందానికి తూట్లు పొడిచారు. కేబినెట్ నిర్ణయానికి మంగళం పలికారు. ప్రస్తుతం సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు మాస్టర్ డెవలపర్‌గా స్విస్ ఛాలెంజ్ విధానంలో చేసిన ప్రతిపాదనలకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. తొలుత సింగపూర్ ప్రభుత్వ కంపెనీలనే మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించారు.
ఇప్పుడు సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీలైన అసెండాస్, సెంబ్‌బ్రిడ్జి గ్రూపు అండ్ సెంబ్‌కార్ప్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ మాస్టర్ డెవలపర్‌గా స్విస్‌చాలెంజ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. తొలి ఒప్పందంలో తొలి దశలో సీడ్ క్యాపిటల్ ఏరియా 8 చదరపు కిలోమీటర్లుగా పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అయితే, సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో సీడ్ క్యాపిటల్ ఏరియాను 16.9 చదరపు కిలోమీటర్లకు పెంచాయి. ఈ పెంపు గతంలో కుదిరిన ఒప్పందానికి భిన్నంగా ఉందని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు సీడ్ క్యాపిటల్ ఏరియాను 20 చదరపు కిలోమీటర్లకు పెంచేశాయి.
ప్రణాళికలు యథాతథంగా అమలు
సింగపూర్ కంపెనీలు రూపొందించిన మాస్టర్ ప్రణాళికల అమలుపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సింగపూర్‌కు చెందిన ‘సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఖూ టెంగ్ చాయ్ ప్రజెంటేషన్ ఇచ్చారు.