సాక్షి, సిటీబ్యూరో: లక్షల మంది ప్రయాణికులపై భారాన్ని మోపుతూ ప్రభుత్వం శుక్రవారం ఆటో చార్జీలను పెంచింది. ఈ మేరకు రవాణాశాఖ జీవో నం.20 విడుదల చేసింది. దాంతో గ్రేటర్‌లోని లక్షా 20 వేల ఆటోరిక్షాలను వినియోగించుకొనే సుమారు 15 లక్షల మంది ప్రయణికులపై చార్జీల భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన ఆర్టీసీ చార్జీలు, ఆకాశాన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు, వంటగ్యాస్ భారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యుడిపై తాజాగా ఆటో పిడుగు పడింది. పెరిగిన చార్జీలు శనివారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి రానున్నాయి.
మొదటి 1.6 కిలోమీటర్ల దూరానికే ప్రయాణికుడిపై ఏకంగా రూ.4 పెంచారు. ఆ తర్వాత చేసే ప్రతి కిలోమీటర్ దూరానికి రెండురూపాయల చొప్పున అదనపు భారం పడనుంది. దాంతో సగటున ఒక్కో ప్రయాణికుడిపై రూ.10 అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ లెక్కన ప్రతి రోజు ఆటో ప్రయాణికులపై పెరిగిన చార్జీల కారణంగా రూ.కోటీ 50 లక్షల అదనపు భారం పడనుంది.
పెరిగిన చార్జీలు....
ప్రస్తుతం 1.6 కిలోమీటర్ల దూరానికి తీసుకుంటున్న కనీస చార్జీ రూ.16. నేటి నుంచి ఇది రూ.20
ఆ పైన ప్రతి కిలోమీటర్‌కు రూ.9 లను రూ.11 లకు పెంచారు.
ప్రస్తుతం ప్రతి 2 నిమిషాలకు 50 పైసల చొప్పున వెయిటింగ్ చార్జీ తీసుకుంటుండగా ఇక నుంచి దానిని 15 నిమిషాలకు రూ.5 చొప్పున తీసుకుంటారు.
రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు మీటర్ చార్జీలపైన ఆఫ్ రిటర్న్ (50 శాతం అదనంగా) చెల్లించాల్సి ఉంటుంది.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో తిరిగే ఆటోలన్నీ విధిగా మీటర్ చార్జీలకు అనుగుణంగానే ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేయాలి.
చార్జీలు పెంచిన తర్వాత మూడునెలల్లోపు ఆటోడ్రైవర్లు మీటర్లను సవరించుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ పేర్కొన్నారు. నిర్ణీత రీడింగ్ ప్రకారం చార్జీలు తీసుకోవాలని, మీటర్ రీడింగ్ నమోదు చేయకుండా ఇష్టారాజ్యంగా వసూలు చేసినా, తప్పుడు రీడింగ్ నమోదు చేసిన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
ప్రయాణికుల భద్రతపై...
ఇటీవల మహిళలపై చోటుచేసుకుంటున్న దాడుల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై అధికారులు దృష్టి సారించారు.
ప్రతి ఆటోలో విధిగా ఆటో యజమాని, డ్రైవర్ వివరాలను తెలిపే చార్ట్‌ను ఏర్పాటు చేయాలి. డాక్యుమెంట్‌లు కూడా ఆటోలో ఉండాలి.
ఈ- చలానాలు, ట్రాఫిక్ చలానాల తగ్గింపు, తదితర అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు.
ప్రయాణికులపై ఆటో పిడుగు
Published Sat, Feb 15 2014 4:07 AM | Last Updated on Sat, Jul 6 2019 3:22 PM
Advertisement
Advertisement