
ప్రపంచ చూపు.. తెలుగు చిత్రసీమ వైపు
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత ప్రపంచమంతా తెలుగు చిత్రపరిశ్రమ వైపు చూస్తోందని బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్ అభిప్రాయపడ్డారు.
బంజారాహిల్స్: దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత ప్రపంచమంతా తెలుగు చిత్రపరిశ్రమ (టాలీవుడ్) వైపు చూస్తోందని బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్ అభిప్రాయపడ్డారు. నగరానికి చెందిన డ్రీమ్ ఇండియా గ్రూపు ప్రారంభించనున్న సరికొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ను ఆయన బంజారాహిల్స్ తాజ్‌కృష్ణ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినీపరిశ్రమకు మంచి సామర్థ్యం ఉందని, తనకు ఈ పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
తన మొదటి సినిమా కూడా బాపు దర్శకత్వంలో వంశవృక్షం తెలుగులో వచ్చిందని గుర్తుచేశారు. హైదరాబాద్ నగర ప్రజలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయని తెలిపారు. డ్రీమ్ ఇండియా గ్రూప్‌నకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్ బహదుర్‌పురా సమీపంలో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో 300 ఎకరాల్లో రానుందని సంస్థ సీఎండీ సయ్యద్ రఫీ ఇషాక్ తెలిపారు.