
మా ఆస్తిని కాజేసేందుకు లింగమనేని ప్రయత్నిస్తున్నారు...
హైకోర్టులో బద్రీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: బ్యాంకుతో కుమ్మక్కై తమ కంపెనీకి చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు లింగమనేని ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ లింగమనేని రమేశ్, చైర్మన్ లింగమనేని భాస్కరరావులు ప్రయత్నిస్తున్నారం టూ బద్రీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. రూ.75 కోట్ల విలువ చేసే తమ భూమిని రూ.35 కోట్లకే వేలం వేయాలని సిండికేట్ బ్యాంక్ నిర్ణయించిందని, రుణ చెల్లింపునకు చట్ట ప్రకారం గడువు పొడిగించే అవకాశం ఉన్నా, బ్యాంకు ఆ పని చేయడం లేదని, లింగమనేని రమేశ్ తదితరులకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా వ్యవహరిస్తోందంటూ ఆ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై స్పందించిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ లింగమనేని రమేశ్, అతని తండ్రి భాస్కరరావులతో పాటు సిండికేట్ బ్యాంక్ ఎండీ, ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఎస్.పి.శర్మ, రీజినల్ మేనేజర్ రమణమూర్తి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.