
థౌజండ్‌వాలా..
1,000 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి–2 రికార్డు
10 రోజుల్లోనే ఘనత
ప్రచారంలో సరికొత్త పుంతలు
బీబీసీలో ప్రత్యేక కథనం
బాహుబలిగా నన్ను ఎంచుకుని ‘వన్స్ ఇన్ ఏ లైఫ్‌టైం’ పాత్రను ఇచ్చినందుకు రాజమౌళికి కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించినందుకు నా అభిమానులకు, ప్రేక్షకులకు రుణపడి ఉంటా. కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ చిత్రానికి ఇంత ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉంది. – ప్రభాస్
సాక్షి, హైదరాబాద్
2017 మే 7... 105 సంవత్సరాల చరిత్ర గల భారత సినిమా సింహాసనంపై తెలుగు సినిమా కూర్చున్న రోజు. ఖాన్‌లు, కపూర్‌లు, బచ్చన్‌లకే సాధ్యంకాని రూ.1,000 కోట్ల వసూళ్లను (అన్ని భాషల్లో కలిపి) మన తెలుగు సినిమా బాహుబలి–2 కేవలం పది రోజుల్లోనే సాధించేసింది. ఈ విషయాన్ని ‘బాహుబలి’అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ధ్రువీకరించారు. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రరాజం వసూళ్ల ప్రభంజనం ప్రారంభమైంది. మొదటిరోజు దేశంలోని 29 రాష్ట్రాల్లో బాహుబలివే రికార్డు వసూళ్లు(తమిళనాడులో మార్నింగ్ షోలు పడకపోవడంతో అక్కడ రికార్డు రాలేదు). రాజమౌళి కల, ప్రభాస్, రానా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల కష్టం, నిర్మాతల ధైర్యానికి భారతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ప్రారంభమే ప్రభంజనం!
బాహుబలి ప్రారంభమయ్యే నాటికి తెలుగు సినిమా మార్కెట్ రూ.50–70 కోట్లు మాత్రమే. అలాంటిది రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఓ ప్రాంతీయ సినిమా నిర్మాణం అంటే అందరూ నోరెళ్లబెట్టారు. మొదలైన రోజు నుంచే సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. మొదటి భాగం విడుదలయ్యే నాటికి ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. వాటన్నిటిని అందుకుంటూ మొదటి భాగమే అద్భుత విజయం సాధించింది. ఆ స్థాయి విజయాన్ని అసలు ఊహించనే లేదని చిత్రబృందం అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చింది. మొదటి భాగం విడిచిపెట్టిన ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’అనే ప్రశ్న రెండేళ్ల పాటు ప్రేక్షకులను రెండో భాగంపై ఆసక్తిని మరింత పెంచింది.
రెండో భాగం విడుదలయ్యే నాటికే ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని తెలిసినా రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరుతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ పది రోజుల్లోనే బాహుబలి ‘మ్యాజిక్ ఫిగర్’ను చేరింది. సమీప భవిష్యత్తులో మరే చిత్రం అందుకోలేని రికార్డులను బాహుబలి సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టింది. మొదటి వారాంతానికే 10 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన బాహుబలి, ఆ తర్వాత మూడు రోజులకే దంగల్(12.36 మిలియన్లు)ను దాటేసింది. ఈ శనివారానికి బాహుబలి 15.2 మిలియన్లను దాటింది. లాంగ్ రన్‌లో 20 మిలియన్ల మార్కును అందుకుంటుందని అంచనా.
ఆదివారం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానుల ‘వెయ్యి కోట్ల’ సంబరాలు
ప్రచారంలో సరికొత్త అధ్యాయం
సినిమా ప్రచారంలో బాహుబలి కొత్త అధ్యాయానికి తెరతీసింది. ఆదాయానికి వీలున్న ఏ విభాగాన్నీ నిర్మాతలు వదిలిపెట్టలేదు. వర్చువల్ రియాలిటీ, టీవీ, యానిమేటెడ్ సిరీస్, బాహుబలి ఉత్పత్తులు, నవలలు, కామిక్ పుస్తకాలు ఇలా ప్రతి రంగంలోకి బాహుబలి ప్రవేశించింది. మొదటి భాగం ప్రారంభమైన నాటి నుంచి నటీనటుల పుట్టినరోజులకు టీజర్లు, మేకింగ్ వీడియోలు, పరీక్షలకు శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోలు, కామెడీ స్కిట్‌లు ఇలా కనీసం నెలకొక్క విషయమైనా వార్తల్లో ఉంటూ ప్రజల్లో ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మొదటి భాగం విడుదల సమయంలో పాత్రల పరిచయం అంటూ మూడు రోజులకో పోస్టర్ వదలడం కూడా భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి. ఇక రెండో భాగం విషయానికి వస్తే సినిమా కంటే ఇతర అంశాలే ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘ద రైజ్ ఆఫ్ శివగామి’పుస్తకం అమెజాన్ బెస్ట్ సెల్లర్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ఓ సినిమాకు ఎలా ప్రచారం చేయాలో రాజమౌళిని చూసే నేర్చుకోవాలంటూ ఎంతో మంది కితాబిచ్చారు.
బాహుబలిపై బీబీసీ కథనం..
ఈ సినిమాకు లభిస్తున్న ప్రశంసలన్నీ ఓ ఎత్తయితే, దీనిపై ప్రతిష్టాత్మక బీబీసీ చానెల్‌లో కథనం రావడం మరో ఎత్తు. భారతీయ సినిమా రికార్డులన్నీ ఈ చిత్రం బద్దలుగొట్టిందని, అమెరికాలో ఈ వారం విడుదలైన అన్ని చిత్రాల్లో(హాలీవుడ్ సహా) బాహుబలి వసూళ్ల పరంగా మూడో స్థానంలో నిలిచిందని ఈ కథనంలో తెలిపారు. ఇందుకోసం వారు రాజమౌళి, అనుష్కను ఇంటర్వూ్య చేశారు.
బాలీవుడ్ ప్రముఖుల శీతకన్ను...
తమ సినిమాలు, సహచర నటుల సినిమాలు, అవార్డులు వచ్చినప్పుడు విపరీతంగా స్పందించే బాలీవుడ్ ప్రముఖులు బాహుబలిపై అస్సలు స్పందించలేదు. పెద్ద హీరోలైన ఖాన్ త్రయం ఆమిర్, షారుక్, సల్మాన్‌లు స్పందించకపోగా.. ద్వితీయ శ్రేణి హీరోలైన హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్ వంటి హీరోలు కూడా నోరెత్తడం లేదు. వరుణ్ ధావన్, కరణ్ జోహార్, శేఖర్ కపూర్ వంటి ప్రముఖులు మాత్రం బాహుబలిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
మరిన్ని భాషల్లోకి...
తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ‘బాహుబలి–2’విడుదలైన విషయం తెలిసిందే. మరికొన్ని భాషల్లోకి ఈ చిత్రం అనువాదం అయ్యే అవకాశం ఉంది. ‘‘బాహుబలి సినిమాను మొదట చైనీస్ భాషలోకి అనువదించాలనుకుంటున్నాం. చైనీస్ మార్కెట్‌ను అంచనా వేసి, స్క్రీన్స్‌ను నిర్ణయిస్తాం. ఆ తర్వాత జపనీస్, కొరియన్, తైవాన్ భాషల్లో అనువదించాలనే ఆలోచన ఉంది. అక్కడ కూడా ప్రేక్షకులు ‘బాహుబలి’సినిమాను ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాం’’అని ‘బాహుబలి’నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఓ ప్రకటనలో తెలిపారు.
చరిత్ర సృష్టిస్తుందని ఊహించలేదు..
‘బాహుబలి విజయం సాధిస్తుందనే అనుకున్నాను కానీ, చరిత్ర సృష్టిస్తుందని ఊహించలేదు. ప్రస్తుతం బాహుబలి విజయం అందించిన ఆనందంలో ఉన్నాను. రికార్డులున్నవి బద్దలు కొట్టడానికే. ఈ రికార్డు కూడా ఎప్పుడైనా బద్దలు కావచ్చు. బాహుబలి తెలుగు సినిమా హద్దులను చెరిపేసింది’– విజయేంద్ర ప్రసాద్, కథా రచయత
అతి పెద్ద మైలురాయి..
‘భారతీయ సినిమా చరిత్రలో అతి పెద్ద మైలురాయిని అతి పెద్ద చిత్రం సాధించింది’
– కరణ్ జోహార్, ప్రముఖ హిందీ దర్శక నిర్మాత
మైలురాయి చేరుకున్నందుకు అభినందనలు
‘భారతీయ సినిమా చరిత్రలోనే తొలిసారి రూ.1,000 కోట్ల మార్కు అందుకున్నందుకు రాజమౌళి, ప్రభాస్, చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’– పవన్ కల్యాణ్
ఊహించనిది నిజమైంది..
‘అస్సలు ఊహకే అందనిది నిజమైంది. తెలుగు సినిమా పరిశ్రమను తలెత్తుకునేలా చేసినందుకు రాజమౌళి, అతని బృందానికి అభినందనలు’– మహేశ్ బాబు