‘శాతకర్ణి’కి పన్ను మినహాయింపు
సీఎం కేసీఆర్‌ను కలసిన సినీ హీరో బాలకృష్ణ
సాక్షి, హైదరాబాద్: గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సినీ హీరో బాలకృష్ణ శుక్రవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. చారిత్రక నేపథ్యంలో నిర్మించిన గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. సానుకూలత వ్యక్తం చేసిన సీఎం, వెంటనే పన్ను మినహాయింపు ఆదేశాలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక నేపథ్యమున్న చిత్రాలు, చారిత్రక వ్యక్తుల ఇతివృత్తంతో తీసిన సినిమాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని తెలిపారు. గతంలో రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చామని, ఇప్పుడు శాతకర్ణికి కూడా ఇస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఈ విధానం కొనసాగుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్‌కు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైందని.. కేవలం 79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుందని బాలకృష్ణ చెప్పారు. తెలంగాణలోని కోటి లింగాలతోపాటు దేశవ్యాప్తంగా అనేక చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్ జరిపినట్లు తెలిపారు. జనవరి 12న విడుదలయ్యే చిత్రం మొదటి ప్రదర్శన చూడాలని సీఎంను ఆహ్వానించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సినీ నిర్మాత రాజీవ్‌రెడ్డి, చిత్ర సమర్పకుడు బిటో శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీఎల్పీ కార్యాలయంలో బాలకృష్ణ సందడి చేశారు. రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితరులతో కొద్దిసేపు మాట్లాడారు. గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి తెలంగాణలో వినోదపు పన్ను మినహాయింపుపై సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చారు. ఆయనకు రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. అప్పటికే అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోవడంతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన కారులో సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు.