
చివరి రోజు..630 కోట్లు
► తెలంగాణ, ఏపీల్లో శుక్రవారం నాటి డిపాజిట్లివి
► ఒక్క హైదరాబాద్‌లోనే జమ అయిన డిపాజిట్లు రూ. 330 కోట్లు
► 2 బ్యాంకుల్లోని 5 ఖాతాల్లో డిపాజిట్లు రూ. 67 కోట్లు
► తిరుపతిలో పది ఖాతాల్లో సగటున 6 కోట్లు డిపాజిట్
► రూ.కోటి కంటే ఎక్కువ జమ అయిన ఖాతాలు 115
► విశాఖ, విజయవాడ, వరంగల్, నెల్లూరు, కరీంనగర్‌లలో భారీగా డిపాజిట్లు
► చివరి రోజున ఎప్పటికప్పుడు ఐటీ అధికారుల పరిశీలన
► ‘నోట్ల రద్దు’ నుంచి ఇరు రాష్ట్రాల్లో కలిపి
రూ.1.48 లక్షల కోట్లు జమ!
సాక్షి, హైదరాబాద్: రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేయడానికి చివరి రోజైన శుక్రవారం.. తెలంగాణ, ఏపీల్లో ఏకంగా రూ.630 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ నగరం పరిధిలోనే రూ.330 కోట్లు జమ అయినట్లు సమాచారం. చివరి రోజున డిపాజిట్ల పరిస్థితిని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలించాయి. భారీగా డిపాజిట్లు చేసిన ఖాతాదారుల వివరాలను సేకరించాయి.
కోట్లలో డిపాజిట్లు..
తమ వద్ద ఉన్న పాత రూ.500, 1,000 నోట్లను జమ చేయడానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన కొందరు చివరి రోజు దాకా నిరీక్షించారు. చివరి రోజునే ఏకంగా రూ.కోటి అంతకంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసిన వారూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. చివరిరోజున ఏపీలోని తిరుపతిలో ఓ మామూలు వ్యాపారి తన ఖాతాలో రూ.50 లక్షలు డిపాజిట్ చేశారు. గత ఏడాది కాలంలో ఆయన ఖాతాలో జమ అయిన మొత్తం కేవలం రూ.11 వేలే కావడం గమనార్హం. ఇక తిరుపతిలోని వివిధ బ్యాంకుల్లో పది మంది ఖాతాదారులు సగటున రూ.6 కోట్ల కంటే ఎక్కువ జమ చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఐదు ఖాతాల్లో ఏకంగా రూ.67 కోట్లు జమ చేసినట్లు తెలిసింది.
ఇందులో రెండు ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీలతో పాటు ముగ్గురు వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరంతా ముందుగానే ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇచ్చి.. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద పన్ను చెల్లించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఆమోద లేఖలు అందజేసినట్లు తెలిసింది. ఇక చివరి రోజున కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేసిన వారు 115 మంది దాకా ఉన్నట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. దీంతో ఏడాది కాలంగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన మొత్తాలు, ఆదాయ పన్ను రిటర్నులను పరిశీలించే పనిలో నిమగ్నమైంది. చివరి రోజు డిపాజిట్ అయిన మొత్తంతో కలుపుకొంటే... నోట్ల రద్దు నాటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి రూ.1.48 లక్షల కోట్ల మేర పాత నోట్లు జమ అయినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి జనవరి 1వ తేదీన పూర్తి సమాచారాన్ని అధికారికంగా వెల్లడిస్తామని ఆదాయ పన్ను శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ప్రధాన నగరాల్లోని బ్రాంచీల్లో నిఘా..
బ్యాంకుల్లో చివరి రోజు జమయ్యే మొత్తాలను ఆదాయ పన్ను శాఖ బృందాలు ఎప్పటికప్పుడు పరిశీలించాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, కరీంనగర్, నెల్లూరు, రాజమండ్రి నగరాల్లోని బ్యాంకు శాఖల్లో లావాదేవీలపై నిఘా పెట్టినట్లు సమాచారం. చివరిరోజు దాకా నిరీక్షించి రూ.2.5 లక్షలు అంతకంటే ఎక్కువ డిపాజిట్లు చేసిన ఖాతాదారులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. వచ్చే వారం రోజుల్లోనే వీరికి నోటీసులు జారీ అవుతాయని ఆ శాఖ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఇక నవంబర్ 8 తరువాత అనుమానిత డిపాజిట్లు పెద్ద ఎత్తున బయటపడ్డాయని, వారందరికీ నోటీసులు జారీ చేసే ప్రక్రియ వారంలో ప్రారంభమవుతుందని వెల్లడించాయి.