నాంపల్లి: అల్ట్రా సౌండ్ పరీక్షల ద్వారా తల్లి కడుపులోనే ఆడ శిశువులను గుర్తించి హత్య చేస్తున్నారని, ఇలాంటి చర్యలు ఉగ్రవాదానికికంటే ప్రమాదకరమని స్వామీ అగ్నివేశ్ అన్నారు. ఉగ్రవాదులు ఎక్కడో ఒక చోట దాడులు చేస్తే, ఆల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా ప్రతి రోజూ వేలాది భ్రూణ హత్యలు చేస్తున్నారన్నారు. పి.ఆర్.ఓ.బి.ఇ(ప్రోబ్) ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కళా మందిరంలో ‘ఉగ్రవాదం నుంచి మానవత్వాన్ని రక్షించండి’ పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టే బిడ్డ ఆడైనా మగయైనా ఒక్కటేనని, పూర్వం ఆడ పిల్లలను తల్లిదండ్రులు చదివించే వారు కాదన్నారు.
జన్మతో ఎవరూ ఉన్నతులు కాలేరని, జీవనంతోనే ఉన్నతులవుతారని పేర్కొన్నారు. మను ష్యులందరూ సమానమైనప్పుడు, మనతో పాటు భూమిపై జీవించే పశుపక్ష్యాదులను హరించడం ఎందుకన్నారు. ఏటా వంద కోట్ల పక్షులు, జంతువులను చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గోవధ మానుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడి రూ.4.5 కోట్లతో బంగారం దారాలతో నేసిన కోటును ధరించడం భావ్యం కాదన్నారు. పేద వాడు నూలుతో వడికిన వస్త్రాన్ని ధరించినప్పుడు ప్రధాని అంత విలువైన దుస్తులెందుకని ప్రశ్నించారు.
ఇలాంటి వ్యత్యాసాల మీద ప్రజలందరూ పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో సేవలందిస్తున్న లవణం, సంఘ సేవకులు చలసాని రాజారామ్ మోహన్ రావు, ఇస్లామి ఫిఖ్ అకాడమీ ప్రధాన కార్యదర్శి మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానిలకు అంతర్జాతీయ మానవత్వ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రోబ్ సంస్థ అధ్యక్షులు శ్రీశైలం అధ్యక్షతన జరిగిన సభలో శ్రీరామానుజ మిషన్ ట్రస్టు చెన్నై మేనేజింగ్ ట్రస్టీ ఎస్‌ఎఆర్.ప్రసన్న వెంకటాచారియార్ చతుర్వేది స్వామి, విఠల్ రావు, విల్సన్ మెకో తదితరులు పాల్గొన్నారు.
అందరినీ బతకనివ్వండి: స్వామి అగ్నివేశ్
Published Mon, Mar 30 2015 3:44 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement