వెటర్నరీ విద్యార్థులపై లాఠీచార్జి | Baton charge on Veterinary Students | Sakshi
Sakshi News home page

వెటర్నరీ విద్యార్థులపై లాఠీచార్జి

Published Wed, Apr 20 2016 4:24 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

వెటర్నరీ విద్యార్థులపై లాఠీచార్జి

వెటర్నరీ విద్యార్థులపై లాఠీచార్జి

జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత
 
 సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ వైద్య పోస్టుల భర్తీ అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మంగళవారం అట్టుడికింది. మంత్రిని ఘెరావ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో రణరంగంగా మారింది. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో... ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెటర్నరీ వైద్య పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కాకుండా... నేరుగా భర్తీ చేయాలన్న డిమాండ్‌తో వెటర్నరీ విద్యార్థులు వారం రోజులుగా వర్సిటీలో ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు జరుగనున్న ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయ వర్సిటీలో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. దీనికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హాజరవుతుండడంతో... ఆయనకు తమ సమస్యలు చెప్పుకుందామని కొందరు వెటర్నరీ విద్యార్థులు వచ్చారు.

కానీ మంత్రిని కలవడానికి వీల్లేదంటూ పోలీసులు వారిని వెనక్కి పంపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న  దాదాపు 500 మంది విద్యార్థులు సమావేశ మందిరం వద్దకు వచ్చారు. అప్పుడే అక్కడికి చేరుకున్న మంత్రి పోచారంను ఘెరావ్ చేశారు. పోలీసులు విద్యార్థులను పక్కకు నెట్టి మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు.. సమావేశ మందిరంలోని కుర్చీలు, బల్లలు, పూల కుండీలను ధ్వంసం చేశారు.  దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి, వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో సాయికిరణ్, శ్రీధర్, బి.రాకేష్ అనే ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. రాకేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మంత్రిని కలసి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సీఎంకు విన్నవిస్తా: పోచారం
  పోలీసుల సహాయంతో సమావేశ మందిరంలోకి వెళ్లిన మంత్రి పోచారం.. విద్యార్థుల ఆందోళన తీవ్రం కావడంతో బయటకు వచ్చి మాట్లాడారు. వెటర్నరీ వైద్య పోస్టుల భర్తీ అంశం తన పరిధిలో లేదని.. దీనిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కానీ స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. మొత్తం 276 వైద్య పోస్టులుంటే అర్హులైన వారు 175 మందే ఉన్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
 
 గోశాలలకు ఉచితంగా గడ్డి సరఫరా
 కరువు పరిస్థితుల్లో రైతులకు మరింత అండగా ఉండాలని వర్క్‌షాప్ సందర్భంగా అధికారులకు మంత్రి పోచారం ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, మహబూబ్‌నగర్, జడ్చర్ల, కొడంగల్, ఆలంపూర్, షాద్‌నగర్, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాల్లోని గోశాలల్లో పశువులకు ఉచితంగా గడ్డి సరఫరా చేయాలని సూచించారు. 231 కరువు మండలాల్లోని  ఒక్కో రైతుకు సంబంధించి ఒక్కో పశువుకు వచ్చే 2 నెలల పాటు వంద కిలోల దాణాను 50 శాతం రాయితీపై ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లను ఈ ఏడాది 100కు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాలకు ప్రతి లీటరుకు ఇస్తున్న రూ.4 ప్రోత్సాహకాన్ని కొనసాగిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement