Jayashanker Agricultural University
-
వీసీ ప్రవీణ్‌రావుకు అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు.. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డుకు ఎంపికయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి విశ్రాంత ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ అవార్డుని ఏర్పాటు చేశాయి. దేశంలో వ్యవసాయ రంగ ప్రగతికి తోడ్పాటు అందిస్తున్న శాస్త్రవేత్తలకు, వృత్తి నిపుణులకు రెండేళ్లకోసారి ఈ అవార్డుని అందజేస్తారు. ఐకార్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆర్ఎస్ పరోడా నేతృత్వంలోని ఎంపిక కమిటీ.. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక రంగాల్లో నిష్ణాతులైన 13 మంది నుంచి వచ్చిన దరఖాస్తులను, రికార్డులను పరిశీలించి ఈ అవార్డుకి ఎంపిక చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతిగా ప్రవీణ్‌రావు బోధన, పరిశోధన, విస్తరణలలో తీసుకున్న అనేక విప్లవాత్మక చర్యల కారణంగా దేశంలోని అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఈ యూనివర్సిటీ ఆరో స్థానంలో నిలిచింది. -
రుణమాఫీలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే!
సాక్షి, హైదరాబాద్: రైతుల కష్టాలను తీర్చే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రకటించే రుణమాఫీలపై తనకు నమ్మకం లేదని.. పండించిన పంటకు తగిన ధర చెల్లించగలిగితే రైతులు కూడా రుణమాఫీల కోసం ఎదురుచూడరని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. రుణమాఫీ వంటివి తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చుగానీ... రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో శనివారం అగ్రిటెక్ –సౌత్ విజన్ 2020 పేరిట 3 రోజుల సదస్సు ప్రారంభమైంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), వ్యవసాయ వర్సిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు హాజరైన ఉపరాష్ట్రపతి సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి వినూత్న ఆలోచనల అవసరముందన్నారు. వరి, గోధుమ వంటి తిండిగింజల ఉత్పత్తి నుంచి రైతు లు పక్కకు జరిగి, పంటల సాగుతోపాటు పాడి, పశుపోషణలను కూడా చేపడితే అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్ రావు, అగ్రిటెక్ సౌత్ సదస్సు చైర్మన్ అనిల్ వి.ఏపూర్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్‌బెరీ తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్ ద్వారానే ‘వ్యవసాయ’ ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ ద్వారానే ర్యాంకులు నిర్ణయించి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రావు చెప్పారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు మాత్రమే ‘నీట్’తో సమస్య అని పేర్కొన్నారు. వాటిని మినహాయిస్తే బైపీసీ ఆధారంగా జరిగే ఇతర కోర్సుల కౌన్సెలింగ్‌కు గతంలో మాదిరిగానే హాజరుకావచ్చని చెప్పారు. మెడికల్ ప్రవేశాలకు ‘నీట్’ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో దాని ప్రభావం తమపై ఉండబోదని.. వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ సీట్లను ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తామని తెలిపారు. కాగా ఆయుష్‌లోని కోర్సులకు కూడా ఇదేవిధంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వెటర్నరీ విద్యార్థులపై లాఠీచార్జి
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ వైద్య పోస్టుల భర్తీ అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మంగళవారం అట్టుడికింది. మంత్రిని ఘెరావ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో రణరంగంగా మారింది. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో... ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెటర్నరీ వైద్య పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కాకుండా... నేరుగా భర్తీ చేయాలన్న డిమాండ్‌తో వెటర్నరీ విద్యార్థులు వారం రోజులుగా వర్సిటీలో ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 5 వరకు జరుగనున్న ‘మన తెలంగాణ-మన వ్యవసాయం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయ వర్సిటీలో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. దీనికి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హాజరవుతుండడంతో... ఆయనకు తమ సమస్యలు చెప్పుకుందామని కొందరు వెటర్నరీ విద్యార్థులు వచ్చారు. కానీ మంత్రిని కలవడానికి వీల్లేదంటూ పోలీసులు వారిని వెనక్కి పంపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న దాదాపు 500 మంది విద్యార్థులు సమావేశ మందిరం వద్దకు వచ్చారు. అప్పుడే అక్కడికి చేరుకున్న మంత్రి పోచారంను ఘెరావ్ చేశారు. పోలీసులు విద్యార్థులను పక్కకు నెట్టి మంత్రిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు.. సమావేశ మందిరంలోని కుర్చీలు, బల్లలు, పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి, వారిని చెదరగొట్టారు. ఈ ఘటనలో సాయికిరణ్, శ్రీధర్, బి.రాకేష్ అనే ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. రాకేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మంత్రిని కలసి సమస్యను పరిష్కరించాలని కోరారు. సీఎంకు విన్నవిస్తా: పోచారం పోలీసుల సహాయంతో సమావేశ మందిరంలోకి వెళ్లిన మంత్రి పోచారం.. విద్యార్థుల ఆందోళన తీవ్రం కావడంతో బయటకు వచ్చి మాట్లాడారు. వెటర్నరీ వైద్య పోస్టుల భర్తీ అంశం తన పరిధిలో లేదని.. దీనిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కానీ స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. మొత్తం 276 వైద్య పోస్టులుంటే అర్హులైన వారు 175 మందే ఉన్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గోశాలలకు ఉచితంగా గడ్డి సరఫరా కరువు పరిస్థితుల్లో రైతులకు మరింత అండగా ఉండాలని వర్క్‌షాప్ సందర్భంగా అధికారులకు మంత్రి పోచారం ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, మహబూబ్‌నగర్, జడ్చర్ల, కొడంగల్, ఆలంపూర్, షాద్‌నగర్, మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాల్లోని గోశాలల్లో పశువులకు ఉచితంగా గడ్డి సరఫరా చేయాలని సూచించారు. 231 కరువు మండలాల్లోని ఒక్కో రైతుకు సంబంధించి ఒక్కో పశువుకు వచ్చే 2 నెలల పాటు వంద కిలోల దాణాను 50 శాతం రాయితీపై ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లను ఈ ఏడాది 100కు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాలకు ప్రతి లీటరుకు ఇస్తున్న రూ.4 ప్రోత్సాహకాన్ని కొనసాగిస్తామన్నారు.