అగ్రిటెక్ 2020 సదస్సులో స్టాళ్లను పరిశీలిస్తున్న వెంకయ్యనాయుడు, వీసీ ప్రవీణ్‌రావు తదితరులు
సాక్షి, హైదరాబాద్: రైతుల కష్టాలను తీర్చే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రకటించే రుణమాఫీలపై తనకు నమ్మకం లేదని.. పండించిన పంటకు తగిన ధర చెల్లించగలిగితే రైతులు కూడా రుణమాఫీల కోసం ఎదురుచూడరని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. రుణమాఫీ వంటివి తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చుగానీ... రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో శనివారం అగ్రిటెక్ –సౌత్ విజన్ 2020 పేరిట 3 రోజుల సదస్సు ప్రారంభమైంది.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), వ్యవసాయ వర్సిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు హాజరైన ఉపరాష్ట్రపతి సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి వినూత్న ఆలోచనల అవసరముందన్నారు. వరి, గోధుమ వంటి తిండిగింజల ఉత్పత్తి నుంచి రైతు లు పక్కకు జరిగి, పంటల సాగుతోపాటు పాడి, పశుపోషణలను కూడా చేపడితే అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ ప్రవీణ్ రావు, అగ్రిటెక్ సౌత్ సదస్సు చైర్మన్ అనిల్ వి.ఏపూర్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్‌బెరీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment