ఉప్పల్, కార్వాన్‌లలో అధికం
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో బీసీ జనగణన పూర్తయింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు హైకోర్టుకు అందజేసిన నివేదిక మేరకు బుధవారం రాత్రికి బీసీ గణన పూర్తి చేశారు. అయితే ఏ డివిజన్‌లో ఎంత శాతం బీసీలు ఉన్నారనే లెక్కలు రాత్రి పొద్దుపోయేంత వరకు సాగుతూనే ఉన్నాయి. గురువారానికి గానీ ఇవి ప్రధాన కార్యాలయానికి అందే పరిస్థితి లేదు. బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు మొత్తం జనాభాలో బీసీలు దాదాపు 21 శాతం మాత్రమే ఉండటం అధికారులను కలవరపాటుకు గురిచేసింది. 2009లో 26 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు తగ్గడానికి కారణాలేమిటనే అంశాలపై దృష్టి సారించారు. మరోమారు సరిచూసుకోవాల్సిందిగా సర్కిళ్లలోని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిజంగానే తగ్గినట్లయితే ఎక్కువగా ఏయే ప్రాంతాల్లో.. ఎందుకు తగ్గారనే వివరాలు పొందుపరచాల్సిందిగా సూచించారు. అధికారిక సమాచారం మేరకు... మొత్తం జనాభా 70,68,495 కాగా... వీరిలో 50,75,520 (72 శాతం) మందికిసంబంధించిన సర్వే వివరాలు అందాయి. మొత్తం పూర్తయ్యేసరికిబీసీల శాతంలో స్వల్ప మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది.
సర్కిళ్ల వారీగా ఇలా...
గ్రేటర్ మొత్తంలో బీసీలు ఎక్కువగా ఉన్న సర్కిళ్లలో ఉప్పల్, ఖైరతాబాద్-బి (కార్వాన్ నియోజకవర్గం) ముందున్నాయి. ఈ రెండు సర్కిళ్ల పరిధిలో 31 శాతానికి పైగా బీసీలు ఉన్నారు. అత్యల్పంగా సర్కిల్-5 (బహదూర్‌పురా, చార్మినార్, గోషామహల్ నియోజక వర్గాలు)లో కేవలం 10.60 శాతం మాత్రమే ఉన్నారు.
వివిధ సర్కిళ్లలోని బీసీల శాతం ఇలా ఉంది...
కాప్రాలో 24.71, ఉప్పల్‌లో 31.29, ఎల్‌బీనగర్-ఎలో 20.03, ఎల్‌బీనగర్-బిలో 19.62, సర్కిల్-4ఏలో 22.43, సర్కిల్-4బిలో 22.82, సర్కిల్-5లో 10.60, రాజేంద్రనగర్‌లో 19.58, సర్కిల్-7ఎలో 27.18, సర్కిల్-7బిలో 31.16, సర్కిల్-8లో 16.07, సర్కిల్-9ఏలో 19.94, 9బీలో 19.67, ఖైరతాబాద్-ఎలో 14.51, ఖైరతాబాద్-బిలో 20.31, శేరిలింగంపల్లి-1లో 25.01, శేరిలింగంపల్లి-2లో 18.81, పటాన్‌చెరు, ఆర్‌సీపురంలలో 30.21, కూకట్‌పల్లి-ఎలో 15.04, కూకట్‌పల్లి-బిలో 21.56, కుత్బుల్లాపూర్‌లో 19.06, అల్వాల్‌లో 15.66, మల్కాజిగిరిలో 15.95, సికింద్రాబాద్‌లో 25.63గా శాతంగా ఉన్నాయి. మొత్తం 20.42 శాతంగా ఉంది.
- ఈనెల 24న ఓటర్ల జాబితా వెలువరించేందుకు, 26న బీసీల ముసాయిదా వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల తొలగించిన 6.30 లక్షల ఓటర్లలో దాదాపు 4.5 లక్షల ఓటర్లను తిరిగి చేర్చినట్లు తెలుస్తోంది. కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారు మరో 52 వేల మంది ఉన్నారు.
బీసీ గణన పూర్తి!
Published Thu, Nov 19 2015 12:02 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement