'షారూఖ్, సల్మాన్ ఫొటోలతో ఎర'
హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న చాలా రకాల సోషల్ వెబ్సైట్ల ద్వారా అమ్మాయిలను మోసగాళ్లు ట్రాప్ చేస్తున్నారని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వివాహిత రాధిక కిడ్నాప్ కేసును ఛేదించిన సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడారు. ప్రొఫైల్ పిక్చర్స్గా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సినిమా హీరోల ఫొటోలతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. ఇలా అమ్మాయిలను తేలికగా మభ్య పెడుతున్నారని చెప్పారు.
పెళ్లి అయిన పెద్దవాళ్లే ఇలాంటివారి వలలో పడుతుంటే ఇంకా పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అమ్మాయిల తల్లిదండ్రులకు సూచించారు. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈనెల 6న రాజేంద్రనగర్లో కిడ్నాపైన వివాహిత రాధిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సోషల్ వెబ్సైట్ల ద్వారా 2011లో నిందితుడు రిజ్వాన్ తో రాధికకు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ పెళ్లి చేసుకోడానికే ఇంటి నుంచి పారిపోయారని డీసీపీ పేర్కొన్నారు. రాధికది కిడ్నాప్ కాదని, ప్రియుడు రిజ్వాన్తో కలిసి కోల్కతాకు వెళ్లారని పోలీసులు తెలిపారు.