Social Websites
-
16 ఏళ్ల పిల్లలు సోషల్ వెబ్సైట్లు ఉపయోగించాలంటే..
బ్రసెల్స్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్‌చాట్ లాంటి సామాజిక వెబ్సైట్లను 16 ఏళ్ల లోపు పిల్లలు ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ యూరోపియన్ యూనియన్ తాజా ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రస్తుతం యూరప్ దేశాల్లో 13 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక వెబ్సైట్లను ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరే అని చట్టం అమల్లో ఉంది. ఈ చట్టంలో పేర్కొన్న పిల్లల వయస్సును 13 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు పెంచాలన్నది తాజా ప్రతిపాదన. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అతుతున్నప్పటికీ ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తున్న వారి వాదన ఇలా ఉంది...... 1. ఇప్పటికే 13 ఏళ్ల నిబంధన వల్ల యూరప్ దేశాల్లో పిల్లలు విద్యలో, మానసిక వికాసంలో పాశ్చాత్య దేశాల పిల్లలకన్నా వెనకబడి ఉన్నారు. 2. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇప్పటికే ఎంతో మంది పిల్లలు సోషల్ వెబ్సైట్లను ఉపయోగిస్తున్నారు. కొన్ని సార్లు ఏజ్‌ను తప్పుగా చూపిస్తున్నారు. 3. ఇప్పుడు ఏజ్ పెంచినా ప్రయోజనం ఉండదు. వారు కూడా ఇలాంటి తప్పు దారుల్లో ఉపయోగిస్తారు. 4. ఏజ్‌ను ధ్రువీకరించుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తల్లిదండ్రుల అనుమతిని దొడ్డిదారిన పొందే అవకాశం ఎలాగూ ఉంటుంది. 5. పిల్లల కెరీర్ నిపుణులను సంప్రదించకుండానే ఇలాంటి నిర్ణయం యూరోపియన్ యూనియన్ తీసుకోవడం శోచనీయమని ఫేస్బుక్, స్నాప్‌చాట్ యాజమాన్యాలు విమర్శించాయి. కాకపోతే ఎడల్ట్ మెటీరియల్ పిల్లలకు అందుబాటులో లేకుండా రక్షణ చర్యలు తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని ఆ సంస్థలు చెబుతున్నాయి. చట్టం సవరణకు సంబంధించిన తాజా బిల్లును ఇంకా యూరోపియన్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. -
భార్యామణి... బీర్ ప్లీజ్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా గురువారం నాడు సోషల్ వెబ్సైట్లలో స్త్రీ, పురుషులు తమదైన శైలిలో స్పందించారు. వ్యాఖ్యలు చేశారు. వాటిలో కొన్ని హస్యోక్తులు ఉండగా, మరికొన్ని వ్యంగోక్తులు ఉన్నాయి. విమర్శలూ, ప్రతివిమర్శలూ ఉన్నాయి. ‘మరో బీర్ ప్లీజ్, భార్యామణి!....పెగ్గు ప్లీజ్, మైడియర్ వైఫ్...ఛీ, బతుకు జిమ్మడ ! అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8)నాడు కూడా బిడ్డను చూసుకోవడానికే సరిపోతోంది. ఈ రోజు అంతే! బేబీ సిట్టింగ్ డ్యూటీ వదిలేది ఎప్పుడు?...ఈ రోజు మెన్స్ డేనే కాదు, అంతర్జాతీయ టాయిలెట్స్ డే కూడా....’ అంటూ వ్యాఖ్యలు. నలభీమ పాకశాస్త్రులైన గ్రేట్ చెఫ్స్‌కు శుభాభినందనలు అంటూ కొంత మంది మహిళలు వ్యాఖ్యలు చేయగా, తమ ఆయనల పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వారికిష్టమైన రంగుల దుస్తులు ధరిస్తున్నానని మరికొందరు వ్యాఖ్యానించారు. కుటుంబ ఒత్తిళ్ల కారణంగా ఎక్కువ మంది యువకులు 45 ఏళ్ల ప్రాయంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మగవాళ్ల ఆత్మహత్యలను నివారించేందుకు సరైన చర్యలు తీసుకోవాలనిప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కొంతమంది మగవాళ్లు ట్వీట్లు చేయగా, రేప్ కేసుల్లో కఠిన శిక్షలను తగ్గించాలంటూ మరికొందరు ట్వీట్లు చేశారు. స్త్రీ, పురుషుల మధ్య లింగ వివక్షతను దూరం చేయడానికి, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు మెన్స్ డే సందర్భంగా ప్రతిన బూనాలంటూ ఫెమినిస్టులు స్పందించారు. భార్యా బాధితులంతా ఏకం కావాలంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. 1920 దశకం నుంచే కొన్ని దేశాల్లోని సామాజిక గ్రూపులు, సంస్థలు అనధికారికంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుతూ వచ్చాయి. 1992, నవంబర్ 19వ తేదీని మెన్స్ డేగా కొన్ని దేశాలు అధికారికంగా జరుపుతూ వస్తున్నాయి. 1999 నుంచి ఐక్యరాజ్య సమతిలో సభ్యత్వం కలిగిన మెజారిటీ దేశాలు మెన్స్ డేను అధికారికంగా జరుపుతున్నాయి. కొన్ని దేశాలు స్త్రీ, పురుషుల సమానత్వం నినాదంతో ఈరోజును జరుపుకొంటుండగా, మెన్స్ అండ్ బాయ్స్ సంక్షేమ దినోత్సవంగా మరికొన్ని దేశాలు జరుపుతున్నాయి. -
సోషల్ వెబ్సైట్లపై ఇక నిరంతర నిఘా
న్యూఢిల్లీ: సమాజంపై సామాజిక వెబ్సైట్ల ప్రభావం నానాటికీ పెరుగుతోంది. సానుకూల ప్రభావంతో ప్రతికూల ప్రభావం కూడా ఉంటోంది. దీంతో ఈ వెబ్సైట్లపై 24 గంటలూ నిఘా పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు సైబర్ నేరాలను అరికట్టేందుకు, ఐఎస్ఐఎస్ లాంటి సంస్థల నియామకాలను నియంత్రించేందుకు భారత ఇంటెలిజెన్స్ సంస్థ, సైబర్ క్రైమ్ విభాగాలు మాత్రమే ఈ వెబ్సైట్లపై ఈ నిఘాను కొనసాగిస్తూ వచ్చాయి. సోషల్ వెబ్సైట్ల కారణంగా సామాజిక ఆందోళనలు, విధ్వంసకాండలు పెరిగిపోతున్న నేపథ్యంలో అలాంటి వాటిపై కూడా దృష్టిని సారించాలని, అందుకు ఐదు కేంద్ర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో అనుక్షణం నిఘా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి కేంద్ర హోం శాఖ, సమాచార, ప్రసారాల శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిఘాను పర్యవేక్షించాలని నిర్ణయించారు. త్వరలో మరో రెండు మంత్రిత్వ శాఖలను ఇందులో కలపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ శాఖలేమిటో తెలియజేయలేదు. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ భద్రతా మండలి సచివాలయం ఆగస్టు 22వ తేదీన నిర్వహించిన ఓ సమావేశంలో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు అరవింద్ గుప్తా, మాజీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్, ఇతర సీనియర్ ప్రభుత్వాధికారులు, నిపుణులు పాల్గొని సామాజిక వెబ్సైట్ల విస్తరణ, ప్రభావం గురించి విస్తృతంగా చర్చించారు. గతేడాది ఐఎస్ఐఎస్కు అనుకూలమైన సమాచారాన్ని పోస్ట్ చేశారన్న ఆరోపణపై బెంగళూరుకు చెందిన ఎగ్జిక్యూటివ్ మెహదీ మస్రూర్ బిశ్వాస్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో సామాజిక వెబ్సైట్లపై నిఘా వేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకొంది. -
'షారూఖ్, సల్మాన్ ఫొటోలతో ఎర'
హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న చాలా రకాల సోషల్ వెబ్సైట్ల ద్వారా అమ్మాయిలను మోసగాళ్లు ట్రాప్ చేస్తున్నారని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. వివాహిత రాధిక కిడ్నాప్ కేసును ఛేదించిన సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడారు. ప్రొఫైల్ పిక్చర్స్‌గా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి సినిమా హీరోల ఫొటోలతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. ఇలా అమ్మాయిలను తేలికగా మభ్య పెడుతున్నారని చెప్పారు. పెళ్లి అయిన పెద్దవాళ్లే ఇలాంటివారి వలలో పడుతుంటే ఇంకా పిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని అమ్మాయిల తల్లిదండ్రులకు సూచించారు. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈనెల 6న రాజేంద్రనగర్‌లో కిడ్నాపైన వివాహిత రాధిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. సోషల్ వెబ్సైట్ల ద్వారా 2011లో నిందితుడు రిజ్వాన్ తో రాధికకు పరిచయం ఏర్పడిందని, ఇద్దరూ పెళ్లి చేసుకోడానికే ఇంటి నుంచి పారిపోయారని డీసీపీ పేర్కొన్నారు. రాధికది కిడ్నాప్ కాదని, ప్రియుడు రిజ్వాన్‌తో కలిసి కోల్‌కతాకు వెళ్లారని పోలీసులు తెలిపారు. -
15 ఏళ్ల తర్వాత.. నాస్డాక్ కొత్త రికార్డు
సాక్షి, వాణిజ్య విభాగం : గూగుల్, ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆమెజాన్, ఇన్ఫోసిస్...ఒక్కటేమిటి ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ కంపెనీలన్నీ లిస్టయిన అమెరికా నాస్డాక్ సూచీ 15 సంవత్సరాల తర్వాత ఈ గురువారం ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని చేరి చరిత్ర సృష్టించింది. కడపటి సమాచారం అందేసరికి ఈ సూచీ 5,143 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ 15 ఏళ్లలో అదే అమెరికాలోని డోజోన్స్ ఇండస్ట్రియల్, ఎస్ అండ్ పీ-500 సూచీలు 2000 సంవత్సరంలో సాధించిన రికార్డును 2007లో ఒకసారి బద్దలుకొట్టిన తర్వాత, మళ్లీ 2013 నుంచి ఇప్పటివరకూ ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. అలాగే భారత్‌తో పాటు పలు ప్రపంచ ప్రధాన సూచీలు కూడా. ఈ సూచీల్లో టెక్నాలజీ కంపెనీలే కాకుండా మెటల్, ఆయిల్, రియాల్టీ తదితర రంగాల షేర్లు లిస్ట్అయివుండటం, ఈ రంగాల్లో గణనీయమైన వృద్ధి 2004-2007 మధ్య జరగడం కారణం. ఫీట్ అసాధారణం... నాస్డాక్ మాత్రం 2000 మార్చి 10న నెలకొల్పిన 5,132 పాయింట్ల గరిష్టస్థాయిని అధిగమించడానికి 15 ఏళ్లు నిరీక్షించాల్సివచ్చింది. దశాబ్దాల టెక్నాలజీ వృద్ధిని, ఆయా కంపెనీలు ఆర్జించబోయే లాభాల్ని 1998-2000 మధ్యకాలంలోనే ఇన్వెస్టర్లు అంచనాలు కట్టేయడంతో, అప్పుడే అది 1000 పాయింట్ల నుంచి 5000 పాయింట్లకు పెరిగిపోయింది. ఏ రంగం జోరునైనా స్వల్పకాలంలోనే స్టాక్ మార్కెట్ డిస్కౌంట్ చేసుకోవడం, ఆతర్వాత మరో గొప్ప వృద్ధి విప్లవం వస్తేతప్ప, ఆ మార్కెట్ ఊగిసలాటతో క్షీణించడం తప్ప, మళ్లీ కొత్త రికార్డును చేరడం సాధారణంగా జరగదు. కానీ గురువారం నాస్డాక్ చేసిన ఫీట్ అసాధారణమైనది. మన కంపెనీలూ... టెక్నాలజీకి పర్యాయపదం నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్. ఏ దేశానికి చెందినదైనా గొప్ప టెక్నాలజీ కంపెనీ నాస్డాక్లో లిస్ట్‌కావడం ద్వారా భారీ నిధులు సమీకరించి, వ్యాపారాన్ని పెంచుకున్నవే. మన దేశానికి చెందిన ఇన్ఫోసిస్, విప్రో, సత్యం కంప్యూటర్స్, రీడీఫ్ డాట్ కామ్, డాక్టర్ రెడ్డీస్ లాబ్ వంటి కంపెనీలన్నీ నాస్డాక్ తలుపుతట్టినవే. అక్కడ లిస్టయిన కంపెనీలకు వృద్ధికి అవసరమైన నిధులతో పాటు, బ్రాండ్ ఇమేజ్ వచ్చేసేది. అప్పుడు పేలిపోయిన బుడగ.. ప్రపంచానికంతటికీ పీసీలు విక్రయించిన ఐబీఎం, యాపిల్లు సాఫ్ట్వేర్ విక్రయించిన ఇంటెల్, విండోస్‌ను అందించిన మైక్రోసాఫ్ట్‌లు అప్పట్లో నాస్డాక్ సూచీని పరుగులు పెట్టించాయి. ఇప్పటి స్టార్ట్అప్ కంపెనీల్లా, ఆ సమయంలో ఉప్పెనలా ముంచుకువచ్చిన డాట్‌కామ్ కంపెనీల షేర్లతో నాస్డాక్ సూచీ 2000 సంవత్సరం తొలి త్రైమాసికంలో అడ్డూఆపూ లేకుండా పెరిగిపోయింది. డాట్ కామ్ కంపెనీలు, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కంపెనీలు గొప్పగా ఎదిగిపోతాయని అంచనాలు వేసిన ఇన్వెస్టర్లు, అవి దశాబ్దాలుగా ఆర్జించే లాభాల్ని అప్పుడే లెక్కలు కట్టేయడంతో అధిక విలువలకు షేర్లు పెరిగిపోయి, నాస్డాక్ బుడగ పేలిపోయింది. ఈ రికార్డు రూటే వేరు.... 2000 సంవత్సరంలో నాస్డాక్ రికార్డుస్థాయికి పెరగడానికి మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇంటెల్, హెచ్‌పీ, యాపిల్‌లాంటి దిగ్గజాలతో పాటు పలు డాట్ కామ్ షేర్లు కారణం. డాట్‌కామ్ బుడగపేలిన తర్వాత నాస్డాక్ సూచీ 2001 సెప్టెంబర్‌కల్లా 5,100 పాయింట్ల నుంచి 900కు పతనమయ్యింది. 2004లో లిస్టయిన గూగుల్.. 2008 వరకూ నాస్డాక్ను పెంచుతూ వచ్చింది. ఆ తర్వాత ఐపోన్తో యాపిల్, ఈకామర్స్ కంపెనీలు అమెజాన్, ఈబే, సోషల్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విటర్లు కొత్త రికార్డుల్ని సృష్టిస్తూ, నాస్డాక్ సూచీని 15 ఏళ్ల తర్వాత ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేర్చాయి. -
‘విరమణ వయసు తగ్గించం’
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు తగ్గింపునకు సంబంధించి సామాజిక వెబ్సైట్లలో గురువారం దర్శనమిచ్చిన నకిలీ ప్రశ్న, జవాబులపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. శుక్రవారం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం పదవీ విరమణ వయసును 58కి తగ్గించేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్టు ఈ-మెయిల్ ద్వారా సామాజిక మీడియాలో నకిలీ పార్లమెంట్ ప్రశ్న, తప్పుడు జవాబు దర్శనమిచ్చాయని, ఇది రాజకీయ కుట్ర అని అన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన విద్యుత్ సవరణ బిల్లు-2014ను కేంద్రం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కాగా, ఫ్లోరోసిస్ బారిన పడుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయని కేంద్రం పేర్కొంది. సాగు భారమై ఈ ఏడాది తెలంగాణలో 84 మంది, ఏపీలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వెల్లడించింది. -
అసెంబ్లీ ఎన్నికలెప్పుడు...?
ఇంటర్నెట్లో పోరును ఉధృతం చేసిన ఆప్ న్యూఢిల్లీ: డిసెంబర్ నెల దాదాపు ముగింపుకు వస్తుండగా, ఇంతవరకు అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించకపోవడంతో, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న తన డిమాండ్‌ను సామాజిక వెబ్సైట్లలో మరింత ఉధృతం చేసింది. అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్ నెల వరకూ వాయిదా వేయనున్నారని తమకు అనధికార వర్గాల ద్వారా తెలిసిందని పార్టీ ప్రతినిధి ఆతిషి మర్లీనా చెప్పారు. జమ్మూ- కశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలలో ఫలితాలు బీజేపీకి ఆశాజనకంగా లేకపోతే ఢిల్లీ ఎన్నికల తేదీని ఏప్రిల్ వరకూ వాయిదా వేసే అవకాశం ఉందని ఆప్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫిబ్రవరి మాసంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తి కానుంది. అందువల్ల అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో కూడా జరగవచ్చని భావిస్తోంది. నవంబర్ చివరి వారంలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ అసెంబ్లీ రద్దు కావడంతో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ రద్దయి కూడా నెల రోజులు గడుస్తోందని, కానీ ఎన్నికల తేదీని మాత్రం ప్రకటించడం లేదని ఆప్ నాయకుడొకరు విమర్శించారు. బీజేపీ కుయుక్తులు పన్ని ఏదో ఒక నెపంతో ఎన్నికలను వాయిదా వేసేందుకే ప్రయత్నిస్తోందన్న భావన తమకు కలుగుతోందని మరో నాయకుడు అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికల తేదీని ప్రకటించాలన్న తమ డిమాండ్‌పై చర్చను ప్రారంభిస్తామని చెప్పారు. ‘‘ఢిల్లీ ఎన్నికలు ఏప్రిల్‌కు వాయిదా వేశారా? (ఎందుకు), బీజేపీ అంతగా భయపడుతోందా?’’ అని ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ గురువారం ట్వీటేశారు. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నుంచి వైదొలగిన నాటి నుంచే తాజా ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. -
‘సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్యలు’
ముంబై: సామాజిక వెబ్సైట్లలో అభ్యంతరకరమైన పోస్టింగ్‌లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ హెచ్చరించారు. కేవలం అప్లోడ్ చేసినవారిపై మాత్రమే కాకుండా వాటిని లైక్ చేసినవారిపై, షేర్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పుణేలోని హడప్సర్లో సాఫ్ట్‌వర్ ఇంజనీర్ మొహసిన్ హత్యకేసు నేపథ్యంలో పాటిల్ ఈ హెచ్చరికలు చేశారు. సోషల్ మీడియాను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉపయోగిస్తున్నారని, మంచికి ఉపయోగపడాల్సిన దానిని ఇలా దుర్వినియోగం చేస్తే ఊరుకునేదిలేదన్నారు. మొబైల్ ఫోన్‌ను దుర్వినియోగం చేసినా కూడా సదరు ఫోన్ యజమానిపై చర్యలు తప్పవన్నారు. ఇందుకు ఏవైనా చట్టాలు అవసరమైతే వాటిని రూపొందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
సామాజిక వెబ్సైట్లపై ప్రత్యేక నిఘా
కొత్త కొత్త వ్యక్తులతో పరిచయంతోపాటు కొత్త కొత్త అంశాలను తెలుసుకునే వీలుకల్పించేవే సామాజిక మీడియా వెబ్సైట్లు. అయితే రానురాను ఈ వెబ్సైట్లు సమాజానికి పెనుసవాలుగా మారుతున్నాయి. రెచ్చగొట్టే రాతలను పోస్టు చేయడంతోపాటు ఫొటోలను ఉంచుతుండడంతో ఎక్కడో ఒకచోట ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఈ వెబ్సైట్ల వల్ల తలెత్తకుండా చేసేందుకు నగరపోలీసులు నడుం బిగించారు. న్యూఢిల్లీ: సామాజిక వెబ్సైట్లలోని అంశాలపై ఢి ల్లీ పోలీసుశాఖ నిరంతర నిఘా ఉంచనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇటీవలి కాలంలో పలు వెబ్సైట్లలో రెచ్చగొట్టే రాతలు కనిపిస్తుండడంతో ఇటువంటి వాటిని నిరోధించాలని కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సంబంధిత పోలీసు అధికారి ఒకరు వె ల్లడించారు. ‘సోషల్ మీడియా ప్రభావం ఇటీవల బాగా పెరిగిపోయింది. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాం. సంఘ వ్యతిరేకశక్తులు ఈ మీడియాను దుర్వినియోగం చేసే ప్రమాదం పొంచిఉంది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగానే ఓ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం కూడా లభించింది’ అని అన్నారు. అయితే ఈ నిఘా అనేది చొరబాటుతత్వాన్ని కలిగిఉండబోదన్నారు. బహిరంగంగా అందుబాటులో ఉన్న అంశాలనే నిరంతరం పరిశీలిస్తుంటామన్నారు. అదికూడా రాజధాని నగరానికి సంబంధించి పోస్టుచేసిన అంశాలపైనే తమ దృష్టి ఉంటుందన్నారు. పోలీసులు చేపట్టిన ఈ కొత్త కార్యక్రమంలో భాగంగా ఫేస్బుక్, ట్విటర్ వంటి అత్యంత ప్రజాదరణ కలిగిన సామాజిక మీడియా వెబ్సైట్లనే నిరంతరం పరిశీలిస్తుంటామన్నారు. కొత్తగా తాము ఏర్పాటు చేయబోయే కేంద్రంద్వారా వివిధ అంశాలపై ప్రజాభిప్రాయంతోపాటు వారి మనోభావాలను తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. దినపత్రికల్లో కొన్ని వార్తల కటింగ్లను ప్రతినిత్యం సేకరిస్తున్న మాదిరిగానే సామాజిక మీడియా వెబ్సైట్లలోని అంశాలను కూడా తెలుసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుత తరుణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామే తప్ప గూఢచార విభాగంపై ఆధారపడడం వంటి పురాతన పద్ధతులను ఆశ్రయించలేమన్నారు. నేటి యువత వీలైనంతమేర అధునాతన జీవితాన్ని గడిపేందుకే మొగ్గుచూపుతున్నారన్నారు. మరో నాలుగు లేదా ఐదు నెలల కాలంలో తాము ప్రతిపాదించిన కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కేంద్రంలో ఓ సర్వర్‌తోపాటు, ప్రభుత్వం ఆమోదించిన సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటుందన్నారు. తమ సిబ్బందికి వీటి వినియోగంపై శిక్షణ ఇస్తామన్నారు. కాగా నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారన్నారు.