కొత్త కొత్త వ్యక్తులతో పరిచయంతోపాటు కొత్త కొత్త అంశాలను తెలుసుకునే వీలుకల్పించేవే సామాజిక మీడియా వెబ్‌సైట్లు. అయితే రానురాను ఈ వెబ్‌సైట్లు సమాజానికి పెనుసవాలుగా మారుతున్నాయి. రెచ్చగొట్టే రాతలను పోస్టు చేయడంతోపాటు ఫొటోలను ఉంచుతుండడంతో ఎక్కడో ఒకచోట ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఈ వెబ్‌సైట్ల వల్ల తలెత్తకుండా చేసేందుకు నగరపోలీసులు నడుం బిగించారు.
న్యూఢిల్లీ: సామాజిక వెబ్‌సైట్లలోని అంశాలపై ఢి ల్లీ పోలీసుశాఖ నిరంతర నిఘా ఉంచనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇటీవలి కాలంలో పలు వెబ్‌సైట్లలో రెచ్చగొట్టే రాతలు కనిపిస్తుండడంతో ఇటువంటి వాటిని నిరోధించాలని కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సంబంధిత పోలీసు అధికారి ఒకరు వె ల్లడించారు. ‘సోషల్ మీడియా ప్రభావం ఇటీవల బాగా పెరిగిపోయింది. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నాం. సంఘ వ్యతిరేకశక్తులు ఈ మీడియాను దుర్వినియోగం చేసే ప్రమాదం పొంచిఉంది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగానే ఓ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం కూడా లభించింది’ అని అన్నారు.
అయితే ఈ నిఘా అనేది చొరబాటుతత్వాన్ని కలిగిఉండబోదన్నారు. బహిరంగంగా అందుబాటులో ఉన్న అంశాలనే నిరంతరం పరిశీలిస్తుంటామన్నారు. అదికూడా రాజధాని నగరానికి సంబంధించి పోస్టుచేసిన అంశాలపైనే తమ దృష్టి ఉంటుందన్నారు. పోలీసులు చేపట్టిన ఈ కొత్త కార్యక్రమంలో భాగంగా ఫేస్‌బుక్, ట్విటర్ వంటి అత్యంత ప్రజాదరణ కలిగిన సామాజిక మీడియా వెబ్‌సైట్లనే నిరంతరం పరిశీలిస్తుంటామన్నారు. కొత్తగా తాము ఏర్పాటు చేయబోయే కేంద్రంద్వారా వివిధ అంశాలపై ప్రజాభిప్రాయంతోపాటు వారి మనోభావాలను తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. దినపత్రికల్లో కొన్ని వార్తల కటింగ్‌లను ప్రతినిత్యం సేకరిస్తున్న మాదిరిగానే సామాజిక మీడియా వెబ్‌సైట్లలోని అంశాలను కూడా తెలుసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తామన్నారు.
ప్రస్తుత తరుణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామే తప్ప గూఢచార విభాగంపై ఆధారపడడం వంటి పురాతన పద్ధతులను ఆశ్రయించలేమన్నారు. నేటి యువత వీలైనంతమేర అధునాతన జీవితాన్ని గడిపేందుకే మొగ్గుచూపుతున్నారన్నారు. మరో నాలుగు లేదా ఐదు నెలల కాలంలో తాము ప్రతిపాదించిన కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కేంద్రంలో ఓ సర్వర్‌తోపాటు, ప్రభుత్వం ఆమోదించిన సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంటుందన్నారు. తమ సిబ్బందికి వీటి వినియోగంపై శిక్షణ ఇస్తామన్నారు. కాగా నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టారన్నారు.
సామాజిక వెబ్‌సైట్లపై ప్రత్యేక నిఘా
Published Sun, Jun 8 2014 9:48 PM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM
Advertisement
Advertisement