సోషల్ వెబ్‌సైట్లపై ఇక నిరంతర నిఘా
న్యూఢిల్లీ: సమాజంపై సామాజిక వెబ్‌సైట్ల ప్రభావం నానాటికీ పెరుగుతోంది. సానుకూల ప్రభావంతో ప్రతికూల ప్రభావం కూడా ఉంటోంది. దీంతో ఈ వెబ్‌సైట్లపై 24 గంటలూ నిఘా పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు సైబర్ నేరాలను అరికట్టేందుకు, ఐఎస్‌ఐఎస్ లాంటి సంస్థల నియామకాలను నియంత్రించేందుకు భారత ఇంటెలిజెన్స్ సంస్థ, సైబర్ క్రైమ్ విభాగాలు మాత్రమే ఈ వెబ్‌సైట్లపై ఈ నిఘాను కొనసాగిస్తూ వచ్చాయి.
సోషల్ వెబ్‌సైట్ల కారణంగా సామాజిక ఆందోళనలు, విధ్వంసకాండలు పెరిగిపోతున్న నేపథ్యంలో అలాంటి వాటిపై కూడా దృష్టిని సారించాలని, అందుకు ఐదు కేంద్ర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో అనుక్షణం నిఘా కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి కేంద్ర హోం శాఖ, సమాచార, ప్రసారాల శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నిఘాను పర్యవేక్షించాలని నిర్ణయించారు. త్వరలో మరో రెండు మంత్రిత్వ శాఖలను ఇందులో కలపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ శాఖలేమిటో తెలియజేయలేదు.
విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ భద్రతా మండలి సచివాలయం ఆగస్టు 22వ తేదీన నిర్వహించిన ఓ సమావేశంలో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు అరవింద్ గుప్తా, మాజీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్, ఇతర సీనియర్ ప్రభుత్వాధికారులు, నిపుణులు పాల్గొని సామాజిక వెబ్‌సైట్ల విస్తరణ, ప్రభావం గురించి విస్తృతంగా చర్చించారు.
గతేడాది ఐఎస్‌ఐఎస్‌కు అనుకూలమైన సమాచారాన్ని పోస్ట్ చేశారన్న ఆరోపణపై బెంగళూరుకు చెందిన ఎగ్జిక్యూటివ్ మెహదీ మస్రూర్ బిశ్వాస్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో సామాజిక వెబ్‌సైట్లపై నిఘా వేయాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకొంది.