భార్యామణి... బీర్ ప్లీజ్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా గురువారం నాడు సోషల్ వెబ్‌సైట్లలో స్త్రీ, పురుషులు తమదైన శైలిలో స్పందించారు. వ్యాఖ్యలు చేశారు. వాటిలో కొన్ని హస్యోక్తులు ఉండగా, మరికొన్ని వ్యంగోక్తులు ఉన్నాయి. విమర్శలూ, ప్రతివిమర్శలూ ఉన్నాయి.
‘మరో బీర్ ప్లీజ్, భార్యామణి!....పెగ్గు ప్లీజ్, మైడియర్ వైఫ్...ఛీ, బతుకు జిమ్మడ ! అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8)నాడు కూడా బిడ్డను చూసుకోవడానికే సరిపోతోంది. ఈ రోజు అంతే! బేబీ సిట్టింగ్ డ్యూటీ వదిలేది ఎప్పుడు?...ఈ రోజు మెన్స్ డేనే కాదు, అంతర్జాతీయ టాయిలెట్స్ డే కూడా....’ అంటూ వ్యాఖ్యలు.
నలభీమ పాకశాస్త్రులైన గ్రేట్ చెఫ్స్‌కు శుభాభినందనలు అంటూ కొంత మంది మహిళలు వ్యాఖ్యలు చేయగా, తమ ఆయనల పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వారికిష్టమైన రంగుల దుస్తులు ధరిస్తున్నానని మరికొందరు వ్యాఖ్యానించారు. కుటుంబ ఒత్తిళ్ల కారణంగా ఎక్కువ మంది యువకులు 45 ఏళ్ల ప్రాయంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మగవాళ్ల ఆత్మహత్యలను నివారించేందుకు సరైన చర్యలు తీసుకోవాలనిప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కొంతమంది మగవాళ్లు ట్వీట్లు చేయగా, రేప్ కేసుల్లో కఠిన శిక్షలను తగ్గించాలంటూ మరికొందరు ట్వీట్లు చేశారు. స్త్రీ, పురుషుల మధ్య లింగ వివక్షతను దూరం చేయడానికి, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు మెన్స్ డే సందర్భంగా ప్రతిన బూనాలంటూ ఫెమినిస్టులు స్పందించారు. భార్యా బాధితులంతా ఏకం కావాలంటూ మరికొందరు వ్యాఖ్యానించారు.
1920 దశకం నుంచే కొన్ని దేశాల్లోని సామాజిక గ్రూపులు, సంస్థలు అనధికారికంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుతూ వచ్చాయి. 1992, నవంబర్ 19వ తేదీని మెన్స్ డేగా కొన్ని దేశాలు అధికారికంగా జరుపుతూ వస్తున్నాయి. 1999 నుంచి ఐక్యరాజ్య సమతిలో సభ్యత్వం కలిగిన మెజారిటీ దేశాలు మెన్స్ డేను అధికారికంగా జరుపుతున్నాయి. కొన్ని దేశాలు స్త్రీ, పురుషుల సమానత్వం నినాదంతో ఈరోజును జరుపుకొంటుండగా, మెన్స్ అండ్ బాయ్స్ సంక్షేమ దినోత్సవంగా మరికొన్ని దేశాలు జరుపుతున్నాయి.