15 ఏళ్ల తర్వాత.. నాస్‌డాక్ కొత్త రికార్డు | Nasdaq new record after 15 years | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల తర్వాత.. నాస్‌డాక్ కొత్త రికార్డు

Published Fri, Jun 19 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

15 ఏళ్ల తర్వాత.. నాస్‌డాక్ కొత్త రికార్డు

15 ఏళ్ల తర్వాత.. నాస్‌డాక్ కొత్త రికార్డు

సాక్షి, వాణిజ్య విభాగం : గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆమెజాన్, ఇన్ఫోసిస్...ఒక్కటేమిటి ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ కంపెనీలన్నీ లిస్టయిన అమెరికా నాస్‌డాక్ సూచీ 15 సంవత్సరాల తర్వాత ఈ గురువారం ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని చేరి చరిత్ర సృష్టించింది. కడపటి సమాచారం అందేసరికి ఈ సూచీ 5,143 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ 15 ఏళ్లలో అదే అమెరికాలోని డోజోన్స్ ఇండస్ట్రియల్, ఎస్ అండ్ పీ-500 సూచీలు 2000 సంవత్సరంలో సాధించిన రికార్డును 2007లో ఒకసారి బద్దలుకొట్టిన తర్వాత, మళ్లీ 2013 నుంచి ఇప్పటివరకూ ఎప్పటికప్పుడు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. అలాగే భారత్‌తో పాటు పలు ప్రపంచ ప్రధాన సూచీలు కూడా. ఈ సూచీల్లో టెక్నాలజీ కంపెనీలే కాకుండా మెటల్, ఆయిల్, రియాల్టీ తదితర రంగాల షేర్లు లిస్ట్‌అయివుండటం, ఈ రంగాల్లో గణనీయమైన వృద్ధి 2004-2007 మధ్య జరగడం కారణం.

 ఫీట్ అసాధారణం...
 నాస్‌డాక్ మాత్రం 2000 మార్చి 10న నెలకొల్పిన 5,132 పాయింట్ల గరిష్టస్థాయిని అధిగమించడానికి 15 ఏళ్లు నిరీక్షించాల్సివచ్చింది. దశాబ్దాల టెక్నాలజీ వృద్ధిని, ఆయా కంపెనీలు ఆర్జించబోయే లాభాల్ని 1998-2000 మధ్యకాలంలోనే ఇన్వెస్టర్లు అంచనాలు కట్టేయడంతో, అప్పుడే అది 1000 పాయింట్ల నుంచి 5000 పాయింట్లకు పెరిగిపోయింది. ఏ రంగం జోరునైనా స్వల్పకాలంలోనే స్టాక్ మార్కెట్ డిస్కౌంట్ చేసుకోవడం, ఆతర్వాత మరో గొప్ప వృద్ధి విప్లవం వస్తేతప్ప, ఆ మార్కెట్ ఊగిసలాటతో క్షీణించడం తప్ప, మళ్లీ కొత్త రికార్డును చేరడం సాధారణంగా జరగదు. కానీ గురువారం నాస్‌డాక్ చేసిన ఫీట్ అసాధారణమైనది.

 మన కంపెనీలూ...
 టెక్నాలజీకి పర్యాయపదం నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్. ఏ దేశానికి చెందినదైనా గొప్ప టెక్నాలజీ కంపెనీ నాస్‌డాక్‌లో లిస్ట్‌కావడం ద్వారా భారీ నిధులు సమీకరించి, వ్యాపారాన్ని పెంచుకున్నవే. మన దేశానికి చెందిన ఇన్ఫోసిస్, విప్రో, సత్యం కంప్యూటర్స్, రీడీఫ్ డాట్ కామ్, డాక్టర్ రెడ్డీస్ లాబ్ వంటి కంపెనీలన్నీ నాస్‌డాక్ తలుపుతట్టినవే. అక్కడ లిస్టయిన కంపెనీలకు వృద్ధికి అవసరమైన నిధులతో పాటు, బ్రాండ్ ఇమేజ్ వచ్చేసేది.

 అప్పుడు పేలిపోయిన బుడగ..
 ప్రపంచానికంతటికీ పీసీలు విక్రయించిన ఐబీఎం, యాపిల్‌లు సాఫ్ట్‌వేర్ విక్రయించిన ఇంటెల్, విండోస్‌ను అందించిన మైక్రోసాఫ్ట్‌లు అప్పట్లో  నాస్‌డాక్  సూచీని పరుగులు పెట్టించాయి. ఇప్పటి స్టార్ట్‌అప్ కంపెనీల్లా, ఆ సమయంలో ఉప్పెనలా ముంచుకువచ్చిన డాట్‌కామ్ కంపెనీల షేర్లతో నాస్‌డాక్ సూచీ 2000 సంవత్సరం తొలి త్రైమాసికంలో అడ్డూఆపూ లేకుండా పెరిగిపోయింది. డాట్ కామ్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కంపెనీలు గొప్పగా ఎదిగిపోతాయని అంచనాలు వేసిన ఇన్వెస్టర్లు, అవి  దశాబ్దాలుగా ఆర్జించే లాభాల్ని అప్పుడే లెక్కలు కట్టేయడంతో అధిక విలువలకు షేర్లు పెరిగిపోయి, నాస్‌డాక్ బుడగ పేలిపోయింది.

 ఈ రికార్డు రూటే వేరు....
 2000 సంవత్సరంలో నాస్‌డాక్ రికార్డుస్థాయికి పెరగడానికి మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇంటెల్, హెచ్‌పీ, యాపిల్‌లాంటి దిగ్గజాలతో పాటు పలు డాట్ కామ్ షేర్లు కారణం. డాట్‌కామ్ బుడగపేలిన తర్వాత నాస్‌డాక్ సూచీ 2001 సెప్టెంబర్‌కల్లా 5,100 పాయింట్ల నుంచి 900కు పతనమయ్యింది. 2004లో లిస్టయిన గూగుల్.. 2008 వరకూ నాస్‌డాక్‌ను  పెంచుతూ వచ్చింది. ఆ తర్వాత ఐపోన్‌తో యాపిల్, ఈకామర్స్ కంపెనీలు అమెజాన్, ఈబే, సోషల్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విటర్‌లు కొత్త రికార్డుల్ని సృష్టిస్తూ, నాస్‌డాక్ సూచీని 15 ఏళ్ల తర్వాత ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేర్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement