16 ఏళ్ల పిల్లలు సోషల్ వెబ్‌సైట్లు ఉపయోగించాలంటే..
బ్రసెల్స్: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్‌చాట్ లాంటి సామాజిక వెబ్‌సైట్లను 16 ఏళ్ల లోపు పిల్లలు ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ యూరోపియన్ యూనియన్ తాజా ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రస్తుతం యూరప్ దేశాల్లో 13 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక వెబ్‌సైట్లను ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరే అని చట్టం అమల్లో ఉంది. ఈ చట్టంలో పేర్కొన్న పిల్లల వయస్సును 13 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు పెంచాలన్నది తాజా ప్రతిపాదన. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అతుతున్నప్పటికీ ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు.
వ్యతిరేకిస్తున్న వారి వాదన ఇలా ఉంది......
1. ఇప్పటికే 13 ఏళ్ల నిబంధన వల్ల యూరప్ దేశాల్లో పిల్లలు విద్యలో, మానసిక వికాసంలో పాశ్చాత్య దేశాల పిల్లలకన్నా వెనకబడి ఉన్నారు.
2. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇప్పటికే ఎంతో మంది పిల్లలు సోషల్ వెబ్‌సైట్లను ఉపయోగిస్తున్నారు. కొన్ని సార్లు ఏజ్‌ను తప్పుగా చూపిస్తున్నారు.
3. ఇప్పుడు ఏజ్ పెంచినా ప్రయోజనం ఉండదు. వారు కూడా ఇలాంటి తప్పు దారుల్లో ఉపయోగిస్తారు.
4. ఏజ్‌ను ధ్రువీకరించుకునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తల్లిదండ్రుల అనుమతిని దొడ్డిదారిన పొందే అవకాశం ఎలాగూ ఉంటుంది.
5. పిల్లల కెరీర్ నిపుణులను సంప్రదించకుండానే ఇలాంటి నిర్ణయం యూరోపియన్ యూనియన్ తీసుకోవడం శోచనీయమని ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ యాజమాన్యాలు విమర్శించాయి. కాకపోతే ఎడల్ట్ మెటీరియల్ పిల్లలకు అందుబాటులో లేకుండా రక్షణ చర్యలు తీసుకోవడమే ఉత్తమమైన మార్గమని ఆ సంస్థలు చెబుతున్నాయి. చట్టం సవరణకు సంబంధించిన తాజా బిల్లును ఇంకా యూరోపియన్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది.