
కేంద్ర సంస్థల మాటున కుంభకోణాలు
♦ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్
♦ జెన్‌కోలో బీహెచ్‌ఈఎల్‌ను ముందుపెట్టి అవినీతికి పాల్పడ్డారు
♦ బొగ్గు సరఫరాలో అడ్డగోలుగా దోచుకున్నారు
♦ ప్రశ్నోత్తరాల సమయంలో నిలదీసిన విపక్ష నేత
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ సంస్థలను ముందుపెట్టి రాష్ట్రంలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘జెన్‌కోలో ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ను ముందుపెట్టి కుంభకోణానికి పాల్పడ్డారు. బొగ్గు కొనుగోలులోనూ ఇదే విధంగా చేశారు. బొగ్గు కొనుగోళ్లలో మరో కేంద్ర ప్రభుత్వ సంస్థను జెన్‌కో ముందు పెట్టింది. కానీ ఆదానీలతో బొగ్గు సరఫరా చేయిస్తున్నారు. బొగ్గు ధర తగ్గింది. కానీ జెన్‌కోకు పాత ధరతోనే సరఫరా జరుగుతోంది.
ఇక్కడ కూడా పనిచేసేది కేంద్ర ప్రభుత్వ సంస్థే. కానీ చివరకు వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వసూలు చేస్తారు’ అని విపక్ష నేత వివరించారు. రాష్ట్రంలో ఇంధన పొదుపును, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం గృహ విద్యుత్ వినియోగదారులకు ఎల్‌ఈడీ బల్బులను సరఫరా చేసిందని మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు జవాబిచ్చారు. దీని వల్ల 50 శాతం విద్యుత్ ఆదా అయిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో విపక్ష నేత జోక్యం చేసుకున్నారు. ‘ఎల్‌ఈడీ బల్బుల సరఫరాకు టెండర్లు పిలిచారా? నామినేషన్ పద్దతి మీద అప్పగించారా?’ అని సూటిగా ప్రశ్నించారు.
‘సాధారణ బల్బులకు 60 వాట్ల విద్యుత్ కావాలి. ఎల్‌ఈడీ బల్బులకు 7-8 వాట్లు సరిపోతుంది. ఎల్‌ఈడీ బల్బులను వాడితే సహజంగానే విద్యుత్ విని యోగం తగ్గుతుంది. కానీ మంత్రి అందుకు భిన్నంగా చెబుతున్నారు. నామినేషన్ పద్దతి మీద బల్బులు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడం వల్లే విద్యుత్ ఆదా అయిందంటున్నారు’ అని నిలదీశారు. దీనికి మంత్రి సూటిగా సమాధానం చెప్పకుండా.. నామినేషన్ పద్దతి మీదే అయినా ప్రైవేటు వ్యక్తులకు కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఇచ్చామని అన్నారు. బొగ్గు కొనుగోళ్ల అంశంపై సరైన సమయంలో సమాధానం చెబుతామని, ప్రస్తుతం ఎల్‌ఈడీ బల్బులకే పరిమితం అవుతున్నట్లు ప్రకటించారు.
‘సోమశిల’ నిర్వాసితులకు ఉద్యోగాలు: మంత్రి దేవినేని ఉమ
సోమశిల ప్రాజెక్టు ముంపు ప్రాంతం వారికి జీవో 98(15-4-1986) ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తామని సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. ముంపు ప్రాంతంలో భూ యజ మానులకు నష్టపరిహారం దాదాపుగా చెల్లించేశామని, నిర్వాసితులకు పునరావాసం కల్పించే ప్రతిపాదనలు లేవని అన్నారు. పరిహారం అందక నిర్వాసితులు రోడ్డున పడ్డారని విపక్ష ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు.
యథాస్థానాల్లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు
పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, జలీల్‌ఖాన్ మంగళవారం సభకు హాజరయ్యారు. సభ మొదలైన తర్వాత లోపలకి వచ్చిన వీరిద్దరు విపక్ష సభ్యులుగా తమకు కేటాయించిన పాత స్థానాల్లోనే కూర్చున్నారు.