మూలాలపై నిఘా | Betting danda | Sakshi
Sakshi News home page

మూలాలపై నిఘా

Published Sat, Feb 27 2016 12:05 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

మూలాలపై నిఘా - Sakshi

మూలాలపై నిఘా

 ఫేవ‘రేట్’ కట్టేదెవరు?
బెట్టింగ్ దందాల్లో కీలకంగా రేష్యో
 ఇప్పటి వరకు చిక్కింది పాత్రధారులే
సూత్రధారుల కోసం సాగుతున్న దర్యాప్తు

 
సిటీబ్యూరో: దేశంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఏ రెండు జట్ల మధ్య క్రికెట్ జరుగుతున్నా... నగరంలో బెట్టింగ్ దందా ఊపందుకుంటోంది. హైటెక్ పరిజ్ఞానం వినియోగిస్తూ, వ్యవస్థీకృతంగా ఈ వ్యవహారాలు నడిపిస్తున్న పాత్రధారులు పలువురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బెట్టింగ్ దందాలో అత్యంత కీలకంగా పరిగణించే రేష్యో, ఫేవరెట్‌ల నిర్ధారణ మాత్రం పోలీసులకు అంతు చిక్కట్లేదు. ఈ నేపథ్యంలోనే దీనిపై పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గడిచిన నెల రోజుల్లో చిక్కిన రెండు ముఠాలూ... తమకు రేష్యోను ఢిల్లీకి చెందిన అగర్వాల్ చెప్తున్నాడని వెల్లడించడంతో అతడి కోసం వేట ముమ్మరం చేశారు.
 
వ్యక్తుల నుంచి వ్యవస్థీకృతంగా...
ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్ దందాను బుకీలు (పందాలు స్వీకరించే వ్యక్తులు) ఎవరికి వారుగా చేసుకునే వారు. టీవీల్లో వచ్చే మ్యాచ్ ఆధారంగా ఫలానా టీమ్ గెలుస్తుందనో, ఓడుతుందనో పంటర్ల (పందెం కాసే వాళ్లు) నుంచి బెట్టింగ్స్   స్వీకరించారు. ఇటీవల కాలంలో ఈ వ్యవహారం వ్యవస్థీకృతంగా మారిపోయింది. గత నెల 23న, ఈ నెల మొదటి వారం ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకున్న రెండు ముఠాలూ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నా యి. ఆధునిక పరికరాలు, బ్రాంచ్ కార్యాలయాలు, కలెక్షన్ ఏజెంట్లను పెట్టుకుని మరీ నడిపిస్తున్నట్లు స్పష్టమైంది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసుల సాధారణ నిఘాతో పాటు సాంకేతిక నిఘాకు పని చెప్పారు.
 
‘పై నుంచే’ ఫేవరెట్, రేష్యో...
ఇలా ఆధునిక పంథాలో పందాలు నిర్వహించడంలో ఫేవరెట్ టీమ్ ఎంపిక, రేష్యో నిర్ధారణ అత్యంత కీలకంగా మారాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏ స్థాయిలో ఏ జట్టుపై ఎంత రెట్టింపు ఆఫర్ ఇవ్వాలి? ఎంత మొత్తం అదనంగా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి అంశాలు రేష్యోలో ఉంటాయి. అలాగే ఏ జట్టు ఫేవరెట్ టీమ్ అనేది నిర్థారించడమూ కీలకాంశమే. ఫేవరెట్ జట్టుపై పందాలు కాసే వాళ్లకు తాము గెలిచినప్పుడు వచ్చే మొత్తం తక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు చిక్కిన వారందరూ ఈ వివరాలు ‘పై నుంచి’ వస్తున్నాయని మాత్రమే చెప్పగలిగారు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్‌ల్లో ఉన్న తమ ఏజెంట్లకు నెలనెలా కొంత మొత్తం చెల్లిస్తామని, వారే అంతర్జాతీయ స్థాయిలో జరిగే మ్యాచ్‌ల రేఫ్యో, ఫేవరెట్స్ చెప్తుంటారని వారు పేర్కొన్నారు.
 
అరెస్టయితే ఫోన్ ‘కట్’...
సిటీలో ఉన్న బుకీలకు రేష్యో, ఫేవరెట్స్ చెప్పే ఏజెంట్లు అంతా కేవలం ఫోన్ల ద్వారా పరిచయమైన వారే. వీరిలో ఏ ఒక్కడూ ఇతర రాష్ట్రాల్లో ఉండే ఆ ఏజెంట్లను ప్రత్యక్షంగా చూసిందిలేదు. దీంతో వారు చెప్పిన పేరే అసలుదని నమ్ముతున్నారు. ఫోన్ల ద్వారా వివరాలు చెప్పడం, బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయించుకోవడం ఏజెంట్ల వ్యవహారంగా మారిపోయింది. వీరు ఒక్కో బుకీతో వ్యవహారాలు నెరపడానికి ఒక్కో ఫోన్ నెంబర్ వాడతారు. ఈ సిమ్‌కార్డులతో పాటు బ్యాంకు ఖాతాలు నకిలీ వివరాలతోనే తీసుకుంటారు. సదరు బుకీ పోలీసులకు చిక్కాడని తెలిస్తే... అతడితో సంప్రదింపులు జరపడానికి వినియోగించిన సిమ్‌ను ధ్వం సం చేసేస్తారు. ఆ బ్యాంక్ ఖాతా వాడదు. దీంతో పాత్రధారుల దగ్గరే అరెస్టుల పర్వం ఆగిపోవాల్సి వస్తోంది.
 
ఎవరీ అగర్వాల్..?
ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన రెండు ముఠాల విచారణలోనూ అగర్వాల్ పేరు వెలుగులోకి వచ్చింది. తాము ఢిల్లీకి చెందిన అగర్వాల్ నుంచి రేష్యో, ఫేవరెట్ తెలుసుకుంటామని చెప్పారు. దీంతో ఈ ఇద్దరు అగర్వాల్స్ ఒకరేనా? అనే కోణంపై పోలీసు లు దృష్టి పెట్టారు. మరోపక్క రేష్యో, ఫేవరెట్స్‌ను ముందే నిర్ధారించేస్తున్న నేపథ్యంలో ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్, మాఫియా కోణాలు ఉన్నాయా? అనే అంశా న్నీ పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాదికి చెందిన ఏజెంట్లు దొరికితే తప్ప వీటి మూలాలు వెలుగులోకి రావని అధికారులు పేర్కొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement