క్లిక్ క్లిక్‌లో కిటుకు | Beware of Online Romance Scams and Fraud | Sakshi
Sakshi News home page

క్లిక్ క్లిక్‌లో కిటుకు

Published Fri, Feb 7 2014 8:20 AM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

క్లిక్ క్లిక్‌లో కిటుకు - Sakshi

క్లిక్ క్లిక్‌లో కిటుకు

* అశ్లీలంతో ఎర
 *  సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ
 *  ‘కార్డ్’ సమాచారం తస్కరణ
 *  ఆన్‌లైన్ ద్వారానే టోకరా

సాక్షి,సిటీబ్యూరో: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలో ఉన్న సైబర్‌క్రైమ్ పోలీసులకు ఇటీవల ఓ ఫిర్యాదు అందింది. తమిళనాడులో ఉంటున్న నగరానికి చెందిన ఓ యువకుడి ఖాతా నుంచి రూ.10లక్షలు గోల్‌మాల్ అయ్యాయన్నది దాని సారాంశం. ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు అతగాడు ఓ అశ్లీల వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావడంతో ఈ మోసం చోటుచేసుకుందని గుర్తించారు. క్రెడిట్,డెబిట్ కార్డులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతోపాటు నెట్ బ్యాంకింగ్‌కు ఉపకరించే రహస్య అంశాలను తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు అశ్లీలంతో ఎరవేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
 
రహస్య వివరాలు తస్మాత్ జాగ్రత్త :ఓ వ్యక్తికి చెందిన సొమ్మును ఆన్‌లైన్‌లో స్వాహా చేయడానికి సైబర్‌నేరగాళ్లకు అతడి క్రెడిట్/డెబిట్ కార్డుకు చెందిన నెంబర్, సీవీవీ కోడ్‌లతోపాటు కొన్ని వ్యక్తిగత వివరాలూ అవసరం. ఇంటర్‌నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇవిలేకుండా ఫ్రాడ్‌కు పాల్పడటం సాధ్యం కాదు. గతంలో ఈ వివరాల కోసం సైబర్ నేరగాళ్లు వివిధ పేర్లు, వెరిఫికేషన్లు అంటూ ఫోన్లు చేయడం, మెయిల్స్ పంపడంతోపాటు సూడో సైట్లు సృష్టించేవారు. ఇప్పుడు రూటు మార్చి ‘అశ్లీలందారి’ పట్టారు.
 
టార్గెట్ యూతే: ఈ వ్యవహారంలో సైబర్ నేరగాళ్ల వలలో ఎక్కువగా యువకులే పడుతున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకుని ఆకర్షించేందుకు కొన్ని అశ్లీల వెబ్‌సైట్లను రూపొం దిస్తున్నారు. దీని సమాచారం, అర్ధనగ్న, నగ్నచిత్రాలతో కూడిన చిత్రాలను వివిధ సామాజిక నెట్‌వర్కింగ్ సైట్లతోపాటు వెబ్‌సైట్లకు లింక్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. వీటిని ఆకర్షితులవుతున్న యువత క్లిక్ చేయగా..అందులో పొందుపరిచిన వీడియోలు, ఫొటోలు ఓపెన్ కావాలన్నా కొంత మొత్తం రుసుం చెల్లించాలంటూ ప్రత్యేకలింకు ఏర్పాటు చేస్తున్నారు.

ఇలా లాగిన్ కావడానికి, వీడియోలు-ఫొటోలు చూడటానికి కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని అక్కడ ఉంటోంది. దీంతో ‘కార్డుల’ వివరాలు, నెట్‌బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని ‘వినియోగదారులు’ అందులో పూరిస్తున్నారు. ఈ వివరాలన్నీ నేరుగా సైబర్‌నేరగాళ్లకు చేరిపోవడంతో వాటిని వినియోగించి తేలిగ్గా ఖాతాలు ఖాళీ చేయడమో, ఆన్‌లైన్ షాపింగ్‌చేసి ‘కార్డు’లకు చిల్లుపెట్టడమో చేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడే వారు వినియోగిస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉంటుండడంతో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం అసాధ్యమవుతోంది.
 
 అలాంటి వారికి నైతికత ఉండదు
 ‘ఆన్‌లైన్ షాపింగ్, చెల్లింపులు చేసేప్పుడు పూర్తి నమ్మకమైన సైట్ల ద్వారానే చేపట్టాలి. అశ్లీల సైట్లు నిర్వహించే వారికి నైతికత ఉండదన్నది గుర్తుంచుకోండి. అలాంటి వాళ్లు మీ కార్డులకు సంబంధించిన, ఆన్‌లైన్ ఖాతాల వివరాలు తెలిస్తే కచ్చితంగా దుర్వినియోగం చేస్తారు. అప్రమత్తంగా ఉండడం వల్లే సైబర్ నేరగాళ్లను కట్టడి చేయొచ్చు’     
 - జి.పాలరాజు, డీసీపీ,సీసీఎస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement