భవానీపురం పీఎస్ కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల | Bhavanipuram PSV case In the next steps retention | Sakshi
Sakshi News home page

భవానీపురం పీఎస్ కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల

Published Sat, Aug 8 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

Bhavanipuram PSV case In the next steps retention

సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మరో కేసులో కాల్‌డేటా వివరాలను ఇవ్వాలని వొడాఫోన్, టాటా టెలీ సర్వీసులను ఆదేశిస్తూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (సీఎంఎం) కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విజయవాడ సీఎంఎం కోర్టులో జరుగుతున్న విచారణలో తదుపరి చర్యలన్నింటినీ కూడా నిలిపేసింది. వొడాఫోన్, టాటా టెలీ సర్వీసుల నుంచి కాల్ డేటాకు సంబంధించిన సీల్డ్ కవర్లు అందుకున్న వెంటనే వాటిని ప్రత్యేక దూత ద్వారా హైకోర్టుకు పంపాలని సీఎంఎం కోర్టును హైకోర్టు ఆదేశించింది.

సీల్డ్ కవర్లు అందుకున్న తరువాత వాటిని భద్రపరచాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో కాల్ డేటా వివరాలు ఇవ్వాలని వొడాఫోన్, టాటా టెలీ సర్వీసులను ఆదేశిస్తూ విజయవాడ సీఎంఎం కోర్టు గత నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సర్వీసు ప్రొవైడర్లలో వొడాఫోన్, టాటా టెలీ లేదని, అందువల్ల వారు కాల్ డేటా వివరాలను సీఎంఎం కోర్టుకు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు సైతం వొడాఫోన్, టాటా టెలీ సర్వీసులకు కాల్ డేటా వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వలేదన్నారు.

కాల్ డేటా వివరాలను సమర్పించాల్సిన అవసరమే లేనప్పుడు వాటిని హైకోర్టుకు వచ్చేలా చేయాలని కోరడం అర్థం లేదన్నారు. ఈ వాదనలతో ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ విభేదిస్తూ, ఇదే వ్యవహారంపై గత నెల 13న ఇదే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, అందువల్ల వాటిని ఈ కేసుకూ వర్తింపజేయాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, విజయవాడ సీఎంఎం కోర్టులో భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి జరుగుతున్న కేసు విచారణలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement