సాక్షి, ముంబయి : ఫోన్ కాల్ వివరాలను రికార్డు చేసిన కేసులో తొలుత బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పేరు వినిపించడంతో పెనుదుమారం రేగింది. తాజాగా ఈ కేసులో పలువురు సెలబ్రిటీల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. కాల్ డేటా రికార్డు (సీడీఆర్) కేసులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, నటుడు జాకీ ష్రాఫ్ భార్య ఆయేషా ష్రాఫ్ పేర్లు వెలుగులోకి వచ్చాయని థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. అరెస్టయిన న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖి నుంచి థానే పోలీసులు నటుడు సాహిల్ ఖాన్ కాల్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయేషా ష్రాఫ్ ఈ వివరాలను సిద్ధిఖికి అందచేసినట్టు వెల్లడైందని థానే పోలీస్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అభిషేక్ త్రిముఖి తెలిపారు.
రిజ్వాన్ మొబైల్‌ను పరిశీలించగా ఆయేషా ష్రాఫ్ సాహిల్ ఖాన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలను షేర్ చేసినట్టు విచారణలో వెల్లడైందన్నారు. అయేషా ష్రాఫ్‌కు సాహిల్ ఖాన్‌తో సంబంధం ఉందని, వీరిద్ధరి మధ్య వివాదం తలెత్తడంతో కాల్ డేటా వివరాలను ఆమె రిజ్వాన్‌కు పంపారని చెప్పారు. మరోవైపు ప్రముఖ బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ 2016లో నటుడు హృతిక్ రోషన్ మొబైల్ నెంబర్‌ను సిద్ధిఖీకి షేర్ చేశారని డీసీపీ వెల్లడించారు. ఆమె ఎందుకు హృతిక్ నెంబర్ పంపారనేది వెల్లడికాలేదని..దీనిపై విచారణ జరుగుతున్నదని చెప్పారు.తొలుత కేసులో నవాజుద్దీన్ సిద్ధిఖీకి పోలీసులు సమన్లు జారీ చేయగా కేసులో నటుడు నవాజుద్దీన్‌కు సంబంధం ఉందని భావించారు.
తన భార్య అలియా సిద్ధిఖీపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే కాల్ డేటా కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం సాక్షిగానే ఆయనను పిలిపించామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా అక్రమంగా సంపాదించిన కాల్ డేటా రికార్డులను లాయర్లు ఇతరులకు విక్రయించి సొమ్ముచేసుకునే ప్రైవేట్ డిటెక్టివ్‌ల రాకెట్ సాగుతోందని ఆరోపణలున్నాయి. కాల్ డేటా రికార్డు కేసులో థానే పోలీసులు ఇప్పటివరకూ 12 మందిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment