హైదరాబాద్ : ఎన్నిలక వాగ్దానాలను తుంగలోకి తొక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రజలంతా ఉద్యమించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుపై ప్రజలంతా ఉద్యమించాలన్నారు. తెలుగుజాతి ప్రజలంతా చంద్రబాబుపై దండయాత్ర చేయాలని భూమన అన్నారు.
ఈ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు. హామీల అమలులో విఫలమైన చంద్రబాబుపై తిరగబడాలని భూమన సూచించారు. అన్నివర్గాల ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని, కాపుజాతి ఉద్యమించిన తరహాలో మిగిలిన అన్నివర్గాలు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. వరదలతో జన జీవనం అతలాకుతలం అయిందని, వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని భూమన డిమాండ్ చేశారు.