కానిస్టేబుల్ పరీక్షలకు బయోమెట్రిక్ అమలు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ కొలువు నియామకాలలో నూతన ఒరవడి కోసం రిక్రూట్‌మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. కొలువుల కోసం కోటి ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల నమ్మకాలు వమ్ముకాకుండా ఉండేందుకు నియామకాల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వివిధ విభాగాలలోని 9,281 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 5.36 లక్షల దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. భారీగా దరఖాస్తులు రావడంతో ఒక్కొక్క పోస్టుకు 57 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తవడం, అందులో తప్పొప్పులు సరిచేయడం కూడా పూర్తికావడంతో తదుపరి కార్యాచరణపై రిక్రూట్‌మెంట్ బోర్డు దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి తుది ఎంపిక వరకు ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని నిర్ణయించింది. ఏప్రిల్ 3న జరిగే ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల నుంచి వేలిముద్రలు తీసుకోవాలని యోచిస్తోంది.
అందుకోసం ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు అభ్యర్థులందరూ పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిందిగా స్పష్టం చేసింది. అభ్యర్థులందరి వేలిముద్రలను బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసుకుంటారు. తరువాత జరిగే పరీక్షల్లో అభ్యర్థులు వారేనా? కాదా? అన్నది తెలుసుకోవడానికి ఇది తోడ్పడనుంది. ఎంపికైన తర్వాత ట్రైనింగ్‌కు వెళ్లే అభ్యర్థుల వేలి ముద్రలను కూడా పరిశీలించనున్నారు. దీని ద్వారా ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థి... తుది వరకు అతనేనా కాదా అనేది సులువుగా బయటపడనుంది.