కామారెడ్డి పట్టణంలో రేషన్ సరుకుల కోసం బారులు తీరిన ప్రజలు
సాక్షి, నెట్‌వర్క్ : రాష్ట్రంలో రేషన్ సరుకులకు ‘వేలిముద్రల’ తలనొప్పి వచ్చి పడింది. అక్రమాల నియంత్రణ కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఈ–పాస్ బయోమెట్రిక్ విధానం సమస్యల్లో పడింది. పలు చోట్ల సిగ్నళ్లు పనిచేయకపోవడం, సిగ్నల్ ఉన్నా ఈ–పాస్ సర్వర్లు మొరాయిస్తుండటంతో రేషన్ సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఇక వృద్ధులు, మరికొందరి వేలిముద్రలను బయోమెట్రిక్ పరికరాలు సక్రమంగా గుర్తించకపోతుండటంతో డీలర్లు వారికి సరుకులు ఇవ్వడం లేదు.
రెవెన్యూ అధికారులు రాసి ఇస్తే సరుకులు ఇస్తామంటున్నారు. దాంతో సరుకులు రాక, అధికారుల చుట్టూ తిరగలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఊళ్లను, కుటుంబాలను వదిలి పని కోసం వలస వెళ్లిన వారికి ఈ–పాస్‌తో సమస్యలు ఎదురవుతున్నాయి. స్వయంగా వచ్చి వేలిముద్ర వేయాల్సి రావడంతో ఆ కుటుంబాలు సరుకులు తీసుకోలేకపోతున్నాయి. ఈ–పాస్ విధానం అమలు, లబ్ధిదారుల సమస్యలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
బియ్యం తీసుకోలేక..
రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది పాత జిల్లాల్లో 78,85,980 రేషన్‌కార్డులు ఉన్నాయి. వాటికి పంపిణీ కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన బియ్యం కోటా విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలకూ చేరింది. కానీ చాలా మంది లబ్ధిదారులు బియ్యం తీసుకోలేకపోతున్నారు. రేషన్ అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ–పాస్’సమస్యలే దీనికి కారణం. ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ–పాస్ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చినా.. క్షేత్రస్థాయిలో సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ–పాస్ యంత్రాలకు సిగ్నళ్లు అందకపోవడం, సర్వర్లు మొరాయిస్తుండడానికి తోడు వృద్ధుల వేలిముద్రలు సరిగా పడకపోవడంతో సరుకుల పంపిణీ ఇబ్బందికరంగా మారుతోంది. అందులోనూ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకే సరుకులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని లబ్ధిదారులు వ్యతిరేకిస్తున్నారు. ఇక వేలిముద్రలు పడని వారికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) నుంచి లేఖ తీసుకుని బియ్యం ఇస్తున్నారు. దీంతో వేలిముద్రలు పడని వృద్ధులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
అక్రమాలు తగ్గినా.. పెరిగిన ఇబ్బందులు..
రేషన్ అక్రమాల నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన ఈ–పాస్ విధానంతో చాలా చోట్ల రేషన్ షాపులలో బియ్యం మిగులుతున్నాయి. అందుబాటులో లేక బియ్యం తీసుకోని లబ్ధిదారులు, బోగస్ కార్డులు, రేషన్ బియ్యం వినియోగించనివారుంటే.. ఆ మేర బియ్యం మిగిలిపోతోంది. ఇలా మిగిలిన మేర మరుసటి నెల కోటాకు తగ్గించి సరఫరా చేస్తారు. తద్వారా రేషన్ సరఫరాలో అక్రమాలు తగ్గాయి. కానీ ఈ–పాస్ సమస్యల కారణంగా కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఒక్కో కార్డుకు 20 నిమిషాలు!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని ఓ రేషన్ షాపు వద్ద ‘సాక్షి’పరిశీలన జరిపింది. అక్కడ రేషన్ బియ్యం తీసుకునేందుకు యాభై మంది వరకు క్యూలో ఉన్నారు. అయితే ఒక్కొక్కరు రేషన్ తీసుకోవడానికి ఇరవై నిమిషాల వరకు పట్టడం గమనార్హం. ఈ–పాస్ యంత్రాల ద్వారా వేలి ముద్రలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. సిగ్నల్ రాకపోవడం, సర్వర్ డౌన్ చూపిస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
దీంతో లబ్ధిదారులు రేషన్ బియ్యం కోసం గంటల తరబడి నిలబడడం, రోజుల తరబడి వేచి ఉండడం తప్పడం లేదు. ఇక పాత ఖమ్మం జిల్లాలో ఈ–పాస్ యంత్రాల సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు.. ఎక్కడ ఏ కంపెనీ సిగ్నల్ అధికంగా ఉంటే ఆ సిమ్‌లను అందించారు. అయితే సిగ్నల్ సరిగానే ఉన్నా.. ఈ–పాస్ సర్వర్ మొరాయిస్తుండడంతో ఫలితం ఉండడం లేదు. పాత మెదక్ జిల్లాలోనైతే సిగ్నల్ లేకపోవడం, వేలిముద్రలను గుర్తించకపోవడం వంటి సమస్యలతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
‘వలసల’ వెతలు
వలసలకు మారుపేరైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా మంది పేదలు.. బయోమెట్రిక్ విధానం కారణంగా ఈ నెల రేషన్ సరుకులు తీసుకోలేకపోయారు. ఇక్కడి నుంచి పనికోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే కూలీలు.. బంధువులకు, తెలిసినవారికి తమ రేషన్‌కార్డులను ఇచ్చి, సరుకులు తీసుకుని పెట్టాలని చెబుతారు. రెండు, మూడు నెలలకోసారి స్వగ్రామాలకు వచ్చి బియ్యం తీసుకెళ్తారు.
నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల తదితర ప్రాంతాలన్నిటా ఇదే పరిస్థితి ఉంది. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు చెందిన చాలా మంది గిరిజనులు ముంబైకి వలస వెళ్లారు. ఇక్కడి నుంచి నేరుగా ముంబైకి బస్సు సౌకర్యం ఉండటంతో.. స్థానికంగా ఉండే బంధువులు రేషన్ బియ్యం తీసుకుని, ఆ బస్సుల్లో ముంబైకి పంపేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నెలనెలా ఇంత దూరం రాలేక చాలా మంది సబ్సిడీ బియ్యాన్ని తీసుకోలేకపోతున్నారు. కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని వలస కూలీలదీ ఇదే పరిస్థితి.
ఇంకా చాలా దుకాణాలకు చేరని ఈ–పాస్
బయోమెట్రిక్‌తో రేషన్ సరుకులు అందించేందుకు తీసుకొచ్చిన ఈ–పాస్ యంత్రాలు ఇంకా చాలా దుకాణాలకు చేరలేదు. డీలర్లకు వాటిని ఎలా వినియోగించాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నెల మొదటి వారం గడిచిపోయినా ఇంకా చాలా దుకాణాల్లో ఈ–పాస్ మిషన్లు అమర్చే పని కొనసాగుతోంది. ఇక డీలర్లకు యంత్రాల నిర్వహణపై పూర్తి అవగాహన లేకపోవడం, చాలా దుకాణాల వద్ద సిగ్నళ్లు సరిగా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 వరకే సరుకులు పంపిణీ చేయాలని సర్కారు చెబుతున్నా.. ఈ నెలలో 25వ తేదీ వరకూ కొనసాగేలా కనిపిస్తోంది.
సర్వర్ పనిచేయక సమస్యలు
గతంలో రోజుకు కనీసం వంద కార్డులపై బియ్యం పంపిణీ చేశాం. ఇప్పుడు ఈ–పాస్ విధానం వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. సర్వర్ సరిగా పనిచేయక పోవడంతో ఒక్కో కార్డుకు బియ్యం పంపిణీ చేయడానికి 20 నిమిషాలు పడుతోంది.. – మల్లెపూల శారద, రేషన్ డీలర్, ఆసిఫాబాద్
రెండు రోజులుగా తిరుగుతున్నా..
నల్లగొండ జిల్లా చండూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో చొప్పరివారిగూడెం గ్రామం ఉంది. ఈ గ్రామస్తులు రేషన్ బియ్యం పొందాలంటే చండూరు పట్టణంలోని ఒకటో నంబర్ రేషన్ షాపు వద్దకు రావాలి. ఆ గ్రామానికి చెందిన చొప్పరి పెద్దులు రెండు రోజులుగా రేషన్ షాపు వద్దకు వచ్చి, తిరిగి ఖాళీగానే ఇంటికి వెళ్లిపోతున్నాడు. ఎందుకంటే వేలిముద్రలు పడక ఆయనకు బియ్యం ఇవ్వడం లేదు. -చొప్పరి పెద్దులు, చొప్పరివారిగూడెం, చండూరు, నల్లగొండ
రేషన్‌పై గతంలో ఇచ్చిన సరుకులు
బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, గోధుమలు, కిరోసిన్, చింతపండు
ప్రస్తుతం సరఫరా అవుతున్నవి
బియ్యం, కిరోసిన్ (అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు మాత్రం కిలో పంచదార సరఫరా జరుగుతోంది)
Comments
Please login to add a commentAdd a comment