కరుణలేని నిబంధన... చేయి కోల్పోయిన వృద్ధురాలి వేదన
కర్నూలు (ఆత్మకూరు రూరల్) : సాంకేతిక అభివృద్ధి మనిషిని సౌకర్యవంతంగా ఉంచేందుకు ఉపయోగపడాలి కానీ వారిని మరింత కష్టాల పాలు చేయడానికి కాదు. అక్రమాల నిరోధానికంటూ ప్రవేశ పెట్టిన ఆధార్ ఎందరి ఆధారాలనో పోగొట్టిందో అందరికి తెలిసిందే. అలాంటి కోవలోనిదే పౌరసరఫరాలలో అక్రమాలను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పద్ధతి. లబ్దిదారుల వేలి ముద్రలను స్కానింగ్ చేసి భధ్రపరచి వారు స్వయంగా వేలి ముద్రలు వేసిన తరువాత సరిచూసే ఈ పద్ధతి ఓ వృద్దురాలిని కడుపు కాలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన దూదేకుల హుసేనమ్మ భర్త ఇటీవలే మృతిచెందాడు.
ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఉన్న కష్టాలు చాలవన్నట్లు చేతి వేళ్ళకు అయిన చిన్నపాటి గాయం పెరిగి పెద్దదై గాంగ్రిన్‌గా మారి చేతిని కుళ్ళ జేసింది. దీంతో సంవత్సరం క్రిందట అనివార్యంగా ఆమె ఎడమ చేతిని వైద్యులు ముంజేతి వరకు తొలగించారు. దీంతో ఆమె రేషన్ కార్డుకు రావాల్సిన వెచ్చాలను తీసుకోవడానికి రేషన్ షాపుకు వెళ్తే.. తన ఎడమ చేతి బొటన వ్రేలి ముద్ర వేయలేని కారణంగా డీలరు ఆమెకు రేషన్ ఇవ్వడానికి నిరాకరించాడు. భర్తను కోల్పోయి , మోచేతి వరకు చేతిని కోల్పోయిన హుసేనమ్మకు న్యాయంగా రావాల్సిన రేషన్ వేలి ముద్ర వేయలేని కారణంగా ఏడాదిగా ఇవ్వకపోవడం ప్రభుత్వ సాంకేతికత డొల్లతనాన్ని సూచిస్తోంది. తనకు రేషన్ ఇప్పించండంటూ ఆమె ఆత్మకూరు తహశీల్దార్ రాజశేఖరబాబుకు గురువారం మొరపెట్టుకుంది.