
మరణశయ్యపై మిత్రుడు ఆదుకుందాం.. ఆదరిద్దాం..
ఎండలకు విలవిల్లాడుతున్న పక్షులు
కాపాడాలంటున్న పర్యావరణ వేత్తలు
సిటీబ్యూరో: చెలరేగుతున్న ప్రచండ భానుడు నగరాన్ని నిప్పుల కొలిమిగా మార్చేస్తున్నాడు. ఎండకు తట్టుకోలేక మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. ఇక నేల రాలుతున్న పిట్టలైతే లెక్కే లేదు. నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తట్టుకునే శక్తి ఆ చిరు ప్రాణికి లేదు. గుక్కెడు నీళ్ల కోసం నగరంలోని పక్షులు అలమటిస్తున్నాయి. మండుడెండలో బతికే దారిలేక, నీడనిచ్చే దిక్కు లేక విలవిల్లాడుతున్నాయి. వడదెబ్బకు నేల రాలుతున్నాయి. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న పక్షి జాతులు ఇప్పుడు పదుల సంఖ్యకు పడిపోయింది. ఉన్నవాటిని కాపాడుకోలేకుంటే.. ఒకప్పుడు కిచకిచలతో అలరించిన పిచ్చుకల్లాగే చాలా జాతులను గూగుల్‌లో వెతికే దుస్థితి తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు. మండుతున్న ఎండల్లో పక్షుల రక్షణపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
పక్షుల ప్రాణం ప్రశ్నార్థకం..!
ఇళ్లముందు వాలి కిచకిచమంటూ సందడి చేసే పిచ్చుకలు, ఎక్కడో చెట్టు కొమ్మపైన వాలి సందడి చేసే పక్షుల గుంపులు, కోకిల కూజితాలు క్రమంగా దూరమవుతున్నాయి. అంతరించిపోతున్న జీవజాలానికి ప్రస్తుత ఉష్ణోగ్రతలు మరింత ప్రమాదకరంగా పరిణమించాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో గ్రేటర్‌లో పక్షుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని పేర్కొంటున్నారు. సహజమైన పొదలు, మర్రి, రావి చెట్లు లేకపోవడం, పక్షుల కోసం ప్రత్యేకమైన పార్కులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా వాటి ఉనికికి ముప్పు ఏర్పడింది. దీంతో ఎండ దెబ్బకు పక్షులు చనిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 450 పక్షి జాతులు మనుగడలో ఉంటే హైదరాబాద్‌లో 40 రకాల పక్షులు ఉన్నట్లు అంచనా. వీటిలో చాలా వరకు ప్రస్తుతం ప్రమాదంలోనే ఉన్నాయి.
అతిథుల్లా ఆదరించండి..
నగరీకరణ, వాతావరణ కాలుష్యం, అపార్ట్‌మెంట్ కల్చర్ పక్షుల పాలిట శాపంగా మారింది. ముళ్ల పొదల్లాంటి సహజమైన చెట్లు కానీ, గూళ్లు కానీ లేకపోవడంతో అవి ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడ వాలిపోతున్నాయి. ఆహారం, తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. ఇంటి బాల్కానీలు, ఇంటి నీడల్లో కనిపించే పక్షుల కోసం కోసం గూళ్లు ఏర్పాటు చేయాలి.చిన్న చిన్న నీటి తొట్టెల్లో తాగునీరు అందుబాటులో ఉంచితే.. ఆ చిరుప్రాణికి అదే అమృతం.
నగరంలో పిచ్చుకలు, చిలుకలు, గోరువంకలు, చిన్న సైద, తేనెపిట్ట, జమురు కాకి, కోయిల, గద్ద, డేగ, గువ్వలు, నెమళ్లు వంటి జాతి పక్షులు ప్రమాదకర పరిస్థితుల్లో బతుకుతున్నాయి. అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఆ ప్రమాదం తారాస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో వాటిని చేరదీసి గింజలు, నీళ్లు, గూళ్లు అందుబాటులో ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి.
రేపటి తరాన్ని పరిరక్షించుకోవడమే..
అభివృద్ధి కోసం భారీ నిర్మాణాలు చేపట్టడం అనివార్యం. కానీ పక్షుల మనుగడకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పెద్ద పెద్ద భవనాలు కట్టిన చోట తప్పనిసరిగా పక్షుల కోసం పార్కులు, చెట్లు పెంచాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడితేనే రేపటి తరానికి ఉన్నతమైన పర్యావరణాన్ని అందజేయగలం.
- వక్కలంక రజని, సిటిజన్స్ ఫర్ లోకల్ బయోడైవర్సిటీ అవేర్‌నెస్ అండ్ కన్జర్వేషన్ వ్యవస్థాకులు