సమైక్య పాలకులకు టీఆర్‌ఎస్‌కు తేడా లేదు
దేశం నడిబొడ్డులో ఉన్న హైదరాబాద్ స్టేట్‌ను స్వతంత్ర ముస్లిం రాజ్యంగానో, పాకిస్తాన్‌లో కలిపేయడానికో నైజాం రాజు సిద్ధమైనాడన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చాలామంది ఉద్యమకారులు ప్రాణాలను ఒడ్డి పోరాటం చేశారని వివరించారు. భారతదేశంలోనే విలీనం కావాలంటూ పోరాడిన షోయబుల్లాఖాన్, బందగీ, తుర్రెబాజ్‌ఖాన్ వంటి ముస్లింనేతలను కూడా నిజాం దారుణంగా చంపించాడని లక్ష్మణ్ చెప్పారు. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనికచర్యతో హైదరాబాద్ స్టేట్ కూడా 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైందని వివరించారు.
నియంతృత్వ పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దీనిని అధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకోకుండా అప్పటి సమైక్యపాలకులు కుట్రలు చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా వేడుకలు నిర్వహించుకుంటామని ఎన్నోసార్లు చెప్పిన అప్పటి ఉద్యమనేత కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా రజాకార్లు ఏర్పాటు చేసిన మజ్లిస్ చేతిలో పావుగా మారారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు, సమైక్య పాలకులకు ఈ విషయంలో తేడా లేదన్నారు. మూడేళ్లుగా దీనికోసం పోరాటం చేస్తున్నామని, ఈ ఏడాది సెప్టెంబర్ 17న తామే ఘనంగా వేడుకలు నిర్వహిస్తామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, నైజాం సర్కారోడ సినిమా నిర్మాత రాజమౌళి, చిత్ర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.