‘గ్రేటర్’ పీటమే లక్ష్యం
బీజేపీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ తీర్మానం
సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీటాన్ని దక్కించుకోవడమే ధ్యేయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం పేర్కొంది. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అత్యధిక స్థానాలు సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని పార్టీ సీనియర్ నేత, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్. కె.లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం సోమాజీగూడలోని ఎన్‌కెఎంఎస్ గ్రాండ్ హోటల్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అధ్యక్షతన ‘జీహెచ్‌ఎంసీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ’ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని బూత్‌ల వారీగా పార్టీని పటిష్టం చేయాలని నిర్ణయించామన్నారు. మజ్లిస్, టీఆర్‌ఎస్ పార్టీలే లక్ష్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరంలో మజ్లిస్‌కు బీజేపీ ఒక్కటే పోటీ ఇవ్వగలదని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి స్పష్టమైందన్నారు. గ్రేటర్ ఎన్నికలకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు కార్యాచరణ ప్రణాళిక రూపొం దించాలని కమిటీ తీర్మానించిందన్నారు. గెలుపు గుర్రాలను గుర్తించి, కార్యాచరణ ప్రణాళికకు తుది రూపం ఇస్తామన్నారు.
నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగాలు, కృష్ణా 3వ దశ నీళ్ల తరలింపుపై హామీలు ఇచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమయ్యిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విసృ్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. బీజేపీ పాలిత నగరాల్లో అందిస్తున్న స్వచ్ఛమైన పాలనను గ్రేటర్ హైదరాబాద్‌లోనూ అందిస్తామని, ఇంటింటి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ‘హైదరాబాద్ మనది’ అనే నినాదంతో ప్రజల్లో విశ్వాసాన్ని కల్గించేందుకు కార్యకర్తలు ప్రచారం చేయాలని సూచించారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఆగస్టు నుంచే ప్రచారం చేపట్టాలని సమావేశం అభిప్రాయపడిందని, ఇందుకోసం అసెంబ్లీవారీగా ఇన్‌ఛార్జిలను నియమించడంతో పాటు ప్రచారంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొంటారన్నారు.
నోటిఫికేషన్ తర్వాతే
గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత నిర్ణయిస్తామని ఎమ్మెల్యే లక్ష్మణ్ తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆధార్ కార్డ్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానం చేస్తుండటంపై తమకు అభ్యంతరంలేదని, అయితే... ఆ నెపంతో ఓటర్లను తొలగించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మజ్లిస్ అక్రమ పాలనను నగరవాసులు చవిచూశారని, మళ్లీ వారికి అవకాశం ఇవ్వరని తాము భావిస్తున్నామన్నారు. గత ఎన్నికల్లో నగరంలో బీజేపీ, టీడీపీ, మజ్లీస్ పార్టీలే గెలిచాయని, టీఆర్ ఎస్‌కు బలం లేదని తేలిపోయిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితిని తాము విశ్లేషిస్తున్నామని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితమే ఇందుకు నిదర్శనమన్నారు. డిసెంబర్‌లోగా గ్రేటర్ ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించిందని, అయితే... ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. సమావేశంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.