![‘బ్లాక్’లో బంగారం విక్రయాలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/71478732043_625x300.jpg.webp?itok=u6uzZBWf)
‘బ్లాక్’లో బంగారం విక్రయాలు
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.33 వేలకు చేరింది. బుధవారం బ్లాక్ మార్కెట్‌లో బంగారం విక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. బుధవారం ఉదయం బంగారం వ్యాపారులు 10 గ్రాముల బంగారాన్ని రూ.100 నోట్లు ఇచ్చినవారికి రూ.33 వేలకు విక్రయించారు. అదే రూ.500, రూ.1000 నోట్లు ఇస్తే 10 గ్రాముల బంగారం రూ.43 వేలకు విక్రయించారు.
హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్, సిద్దంబర్‌బజార్‌తో పాటు అబిడ్‌స, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో బ్లాక్‌లో బంగారం విక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. పలువురు వ్యాపారులతో పాటు చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా బ్లాక్‌లో పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారు. దుకాణాలు వెలవెలబోయినా, కొనుగోలుదారులతో వ్యాపారులు ధరలు నిర్ణయించుకుని పక్కదారిలో బంగారం అమ్మకాలు సాగించారు. దీంతో సుమారు రూ.వంద కోట్ల వరకూ బ్లాక్ మార్కెట్‌లో చేతులుమారినట్లు అంచనా. ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో 10 గ్రాముల బంగారం బ్లాక్ లో రూ. 50 వేల వరకు విక్రయించినట్టు వార్తలు వచ్చాయి.