నా బిడ్డ మరణానికి కారణం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలను చూస్తోంటే ఒంటరి స్త్రీలు తమ బిడ్డల్ని చదివించుకోకూడదేమో? అని అన్పిస్తోంది. మా బిడ్డల్ని చంపేసి ఉన్నత విశ్వవిద్యాలయాలు డబ్బులిస్తే మిన్నకుండాలా? ఇలా హింసించి చంపేస్తారనుకుంటే నా పిల్లాణ్ణి ఇక్కడికి పంపించేదాన్నే కాదు..’’ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక ఆవేదన ఇదీ. తన బిడ్డ దళితుడిగా, అంబేడ్కర్ వారసుడిగా పెరిగాడని, ఆ భావాలే జీర్ణించుకున్న రోహిత్‌ని చంపేసి డబ్బులిచ్చి పంపించేద్దామని చూస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
రోహిత్ మరణానికి తనకు కారణం కావాలని అడిగితే ఇంత వరకు సమాధానం లేదన్నారు. నా బిడ్డని సాంఘిక బహిష్కరణ చేసి రోడ్డుమీద ఎందుకు పడుకోబెట్టారో వీసీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రోహిత్ తల్లి వేముల రాధిక సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో రచయితలు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నగరంలోని లామకాన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాధికతో పాటు పలువురు రచయితలు, కవులు, మహిళా సంఘాల నేతలు మాట్లాడారు.
ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ.. దళిత మహిళగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని, తన అత్త తనను, తన బిడ్డలను ఎడం చేత్తో కూడా ముట్టుకునేది కాదని, అసలు ఇంట్లోకే రానిచ్చేవారు కారని చెప్పారు. అందుకే దళితవాడకే వచ్చి దళితుల్లోనే తన బిడ్డలను పెంచుకున్నానని స్పష్టం చేశారు. ఇటువంటి అణచివేత, అవమానం మరొకరికి జరగకూడదంటే రోహిత్ చట్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
రోహిత్ మరణం ఉన్నత విద్యాసంస్థల్లో వేళ్లూనుకొని ఉన్న కుల అణచివేతను బట్టబయలు చేసిందని రచయితలు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. రోహిత్ అస్తిత్వాన్ని తారుమారు చేసే కుట్రలను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రోహిత్, అతని తల్లి రాధిక దళితులు కాదని నిరూపించి, ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు అధికారంలో ఉన్న శక్తులు కృషి చేస్తున్నాయని ఆరోపించారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన సజయ మాట్లాడుతూ భార్యలను వదిలేయొద్దని భర్తలకు చెప్పని వారంతా ఇప్పుడు రోహిత్ తల్లి, రోహిత్ ఎస్సీ కాదని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ వినోదిని మాట్లాడుతూ.. కుల ప్రాతిపదికగానే విశ్వవిద్యాలయాల స్థాపన జరుగుతోందని, ఈ రోజు వర్సిటీలన్నీ గ్రామాల్లోని వివక్షల, వెలివాడలకు కొనసాగింపేనన్నారు. ఈ దేశంలో కావాల్సింది స్త్రీలను అనుమానించే, అవమానించే రాముడు, కృష్ణుడూ కాదని, రావణాసురుడు కావాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు.
ఏ రాజ్యాంగం మీద మోదీ ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగాన్ని రాసింది ఓ దళిత మహిళ కన్నబిడ్డ అంబేడ్కర్ అన్న విషయాన్ని ఆయన మరువరాదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. నాట్వాణి సంఘానికి చెందిన జ్యోతి, అన్వేషి ప్రతినిధి డాక్టర్ సునీత, రచయిత్రి గోగు శ్యామల తదితరులు రాధికకు సంఘీభావం తెలిపారు.