Rohits death
-
నా బిడ్డ మరణానికి కారణం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలను చూస్తోంటే ఒంటరి స్త్రీలు తమ బిడ్డల్ని చదివించుకోకూడదేమో? అని అన్పిస్తోంది. మా బిడ్డల్ని చంపేసి ఉన్నత విశ్వవిద్యాలయాలు డబ్బులిస్తే మిన్నకుండాలా? ఇలా హింసించి చంపేస్తారనుకుంటే నా పిల్లాణ్ణి ఇక్కడికి పంపించేదాన్నే కాదు..’’ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక ఆవేదన ఇదీ. తన బిడ్డ దళితుడిగా, అంబేడ్కర్ వారసుడిగా పెరిగాడని, ఆ భావాలే జీర్ణించుకున్న రోహిత్‌ని చంపేసి డబ్బులిచ్చి పంపించేద్దామని చూస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ మరణానికి తనకు కారణం కావాలని అడిగితే ఇంత వరకు సమాధానం లేదన్నారు. నా బిడ్డని సాంఘిక బహిష్కరణ చేసి రోడ్డుమీద ఎందుకు పడుకోబెట్టారో వీసీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రోహిత్ తల్లి వేముల రాధిక సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో రచయితలు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నగరంలోని లామకాన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాధికతో పాటు పలువురు రచయితలు, కవులు, మహిళా సంఘాల నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా రాధిక మాట్లాడుతూ.. దళిత మహిళగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని, తన అత్త తనను, తన బిడ్డలను ఎడం చేత్తో కూడా ముట్టుకునేది కాదని, అసలు ఇంట్లోకే రానిచ్చేవారు కారని చెప్పారు. అందుకే దళితవాడకే వచ్చి దళితుల్లోనే తన బిడ్డలను పెంచుకున్నానని స్పష్టం చేశారు. ఇటువంటి అణచివేత, అవమానం మరొకరికి జరగకూడదంటే రోహిత్ చట్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రోహిత్ మరణం ఉన్నత విద్యాసంస్థల్లో వేళ్లూనుకొని ఉన్న కుల అణచివేతను బట్టబయలు చేసిందని రచయితలు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు. రోహిత్ అస్తిత్వాన్ని తారుమారు చేసే కుట్రలను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రోహిత్, అతని తల్లి రాధిక దళితులు కాదని నిరూపించి, ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు అధికారంలో ఉన్న శక్తులు కృషి చేస్తున్నాయని ఆరోపించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సజయ మాట్లాడుతూ భార్యలను వదిలేయొద్దని భర్తలకు చెప్పని వారంతా ఇప్పుడు రోహిత్ తల్లి, రోహిత్ ఎస్సీ కాదని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత, ప్రొఫెసర్ వినోదిని మాట్లాడుతూ.. కుల ప్రాతిపదికగానే విశ్వవిద్యాలయాల స్థాపన జరుగుతోందని, ఈ రోజు వర్సిటీలన్నీ గ్రామాల్లోని వివక్షల, వెలివాడలకు కొనసాగింపేనన్నారు. ఈ దేశంలో కావాల్సింది స్త్రీలను అనుమానించే, అవమానించే రాముడు, కృష్ణుడూ కాదని, రావణాసురుడు కావాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. ఏ రాజ్యాంగం మీద మోదీ ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగాన్ని రాసింది ఓ దళిత మహిళ కన్నబిడ్డ అంబేడ్కర్ అన్న విషయాన్ని ఆయన మరువరాదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. నాట్వాణి సంఘానికి చెందిన జ్యోతి, అన్వేషి ప్రతినిధి డాక్టర్ సునీత, రచయిత్రి గోగు శ్యామల తదితరులు రాధికకు సంఘీభావం తెలిపారు. -
రోహిత్ మృతికి నిరసనగా రాస్తారోకో
రేపు రాష్ర్టంలోని విద్యాసంస్థల బంద్ విజయవాడ (మొగల్రాజపురం) : సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ, యూనివర్శిటీ వీసీ అప్పారావును ఆ పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్‌చేస్తూ ఈనెల 3వ తేదీ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చామని ఏపీ విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం చుట్టుగుంటలో కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు డి.అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని కేజీ నుంచి పీజీ వరకూ అన్ని విద్యాసంస్థల్లో బుధవారం బంద్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర మాట్లాడుతూ రోహిత్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజీవ్త్రన్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన దళిత విద్యార్థి మృతిచెందినా ముఖ్యమంత్రి చంద్రబాబు రోహిత్ తల్లిదండ్రులను పరామర్శించే తీరిక లేనంత బిజీగా ఉన్నారన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహ్మద్ మాట్లాడుతూ రోహిత్ మృతికి కారకులపై చర్యలు తీసుకునేంత వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. రోహిత్ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ప్రవీణ్‌తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని మానవహారం నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌చేసి మాచవరం స్టేషన్‌కు తరలించి మధ్యాహ్నం విడుదల చేశారు. -
నేడు ఛలో హెచ్‌సీయూ
దేశవ్యాప్తంగా 10 వేల మంది విద్యార్థుల రాక సాక్షి, హైదరాబాద్: రోహిత్ మృతికి కారకులను శిక్షించాలంటూ సోమవారం తలపెట్టిన ఛలో హెచ్‌సీయూ నేడులో హెచ్‌సీయూ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది విద్యార్థులు తరలిరానున్నారని జేఏసీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని, అందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని పలు యూనివర్సిటీల నుంచి విద్యార్థులు ఇప్పటికే హెచ్సీయూకు చేరుకున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఏపీ నుంచి విద్యార్థులు వస్తున్నట్టు విద్యార్థి నాయకులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెయ్యి మంది విద్యార్థులు తరలిరానున్నారు. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, బాలచంద్ర ముంగేకర్, జేఎన్‌యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మీనా కందస్వామి, హరగోపాల్, కాకి మాధవరావు సహా పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు సభలో పాల్గొంటారని విద్యార్థి నేతలు తెలిపారు. -
స్మృతి ఇరానీ, దత్తాత్రేయలను బర్తరఫ్ చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దోమలగూడ: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి బాధ్యులైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అప్పారావులను సస్పెండ్ చేయాలని, రోహిత్ కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోహిత్ సాలిడాఆరిటీ అండ్ స్ట్రగుల్డ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, గోవర్ధన్ (న్యూడెమాక్రసీ, చంద్రన్న), వేములపల్లి వెంకట్రామయ్య (న్యూడెమాక్రసీ, రాయల), ఆమ్ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి పిఎల్ విశ్వేశ్వర్రావు, జానకిరాములు (ఆర్ఎస్పి), పీఓడబ్ల్యూ సంధ్య, ప్రొఫెసర్ కంచ అయిలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ రోహిత్ మరణాన్ని ఆపలేకపోవడం అధ్యాపకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. ఎంపీ అసదుద్దీన్, ప్రొఫెసర్ హరగోపాల్, సూరేపల్లి సుజాత యూనివర్సిటీలో రెచ్చగొట్టారని ఆరోపిస్తున్న ఏబీవీపీ నాయకులు రోహిత్ ఎందుకు చనిపోయాడన్నదానిపై ఆలోచించకపోవడం దారుణమన్నారు అంతర్జాతీయ వాణిజ్య సంస్థ సూచనల మేరకు భవిష్యత్తులో విద్యార్థులకు స్కాలర్షిప్లు ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యకు బడ్జెట్లో నిధులు తగ్గించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను నాశనం చేస్తుందని, కాషాయీకరణే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు, దేశంలో 290 మంది ప్రొఫెసర్ల లిస్టును తయారు చేసిన ఆర్ఎస్ఎస్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ద్వారా వివిధ పోస్టుల్లో భర్తీ చేయించాలని చూస్తోందని ఆరోపించారు. ఫాసిజాన్ని ఆపకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదమని, దీన్ని ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్య ఘటనలో కేంధ్రమంత్రి దత్తాత్రేయ, వీసీ అప్పారావులను శిక్షించాలని కోరితే బీసీలు దత్తాత్రేయకు, కమ్మలు అప్పారావుకు మద్దతుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మార్కిస్టు రాజకీయాలను విమర్శించిన రోహిత్‌కు సీపీఎం మద్దతు ఇవ్వడంపై కొందరు ప్రశ్నిస్తున్నారని, తమను విమర్శించినంత మాత్రాన రోహిత్ ఘటనపై తప్పును తప్పునుగానే చూస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసు, వెంకట్‌రెడ్డి, నంద్యాల నర్సింహ్మరెడ్డి, శారదాగౌడ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
దత్తాత్రేయ రాజీనామా చేయాల్సిందే
⇒ ఏఐఎస్ఎఫ్ డిమాండ్ ⇒ కేంద్ర మంత్రి ఇంటి ముట్టడికి యత్నం ముషీరాబాద్:: దళిత విద్యార్థి రోహిత్ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన పదవికి రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వేణు, ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్‌కు తరలించా రు. ఈ సందర్భంగా వేణు, శివరామకృష్ణ మాట్లాడుతూ దత్తాత్రేయ యూనివర్సిటీకి లేఖ ఇవ్వడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఏ సంబంధం లేని ఎమ్మెల్సీ రామచంద్రరావు యూనివర్సిటీ, ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఐదుగురిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. దీనికినైతిక బాధ్యత వహిస్తూ దత్తాత్రేయ రాజీనామా చేసి... బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ రామచంద్రరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రోహిత్ కుటుంబ సభ్యులకు తక్షణం రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాలని... కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అరెస్టయిన వారిలో కె.శ్రీనివాస్, వలివుల్లా ఖాద్రీ, శ్రీమాన్, ధర్మేంద్ర, రఘు, వంశీ, ప్రేమ్ తదితరులు ఉన్నారు. మానసిక దాడులు చేస్తున్నాయి బీజేపీ అనుబంధ సంస్థలు సామాజిక సంఘాలపై మానసిక దాడులు చేస్తున్నాయి. మేథోపరమైన చర్చలు జరగాల్సిన చోట హత్యలు జరగడం దురదృష్టకరం. యూనివర్సిటీలలో బీజేపీ అనుబంధ సంస్థలు ఏ ఒక్క సామాజిక అంశంపైనా చర్చలు నిర్వహించిన దాఖలాలు లేవు. దళిత, బలహీన వర్గాల విద్యార్థులపై ప్రణాళికాబద్ధంగా దాడి జరుగుతోంది. దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. - ప్రొఫెసర్ కంచ ఐలయ్య మత తత్వాన్ని బీజేపీ పెంచి పోషిస్తోంది బీజేపీ మత తత్వాన్ని పెంచి పోషిస్తోంది. రాహుల్ గాంధీ పరామర్శను రాజకీయం చేయడం బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావుకు తగదు.దళిత విద్యార్థుల ఆత్మహత్యలపై 2014లో కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు లేఖలు రాస్తే ఇప్పటివరకు సమాధానం లేదు. దళిత విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. - వి.హనుమంతరావు, ఎంపీ రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించాలి రోహిత్ కుటుంబానికి కేంద్రప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సాయాన్నిప్రకటించా లి. రోహి త్ కులం విషయంలో తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు తీసుకోవాలి. హెచ్‌సీయూలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. - జి.చెన్నయ్య, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు తరిమికొడతాం రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే తరిమి కొడతాం. దళిత విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి కవులు, కళాకారులు ఉన్నారు. జ్ఞానం, శీలం, ఏకత లేని సంఘాలు దళిత విద్యార్థులపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటు. - జయరాజ్, సామాజిక కవి